తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో బ్యాంకు పని వేళలు మారాయి.  ఈరోజు వరకు మధ్యాహ్నం రెండు గంటల వరకు పనిచేసిన బ్యాంకులు గురువారం నుండి ఉదయం ఎనిమిది గంటల నుండే ప్రారంభం కానున్నాయి. 8 నుండి మధ్యాహ్నం 12 గంటలకు వరకు పనిచేస్తాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే బ్యాంకుల్లో 50 శాతం సిబ్బందితోనే విధులు నిర్వహిస్తున్నారు. 

కాగా, బుధవారం నుంచి తెలంగాణలో లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. ఉదయం పది తర్వాత నుంచి ఆంక్షలు అమలయ్యాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లు, బస్టాండ్లు, మెట్రోస్టేషన్లు బోసిపోయాయి.

హైదరాబాద్‌లో నిత్యం రద్దీగా వుండే అమీర్‌పేట, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, కోఠి, సుల్తాన్ బజార్ తదితర ప్రాంతాల్లోని వస్త్ర, వాణిజ్య, దుకాణ సముదాయాలను వ్యాపారులు మూసివేయారు. దీంతో నగరంలోని ఫ్లైఓవర్లు, ప్రధాన కూడళ్లు బోసిపోయాయి. పోలీసులు ఎక్కడికక్కడ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి.. సరైన పత్రాలు చూపించిన వారినే అనుమతిస్తున్నారు. 

Also Read:తెలంగాణలో అమల్లోకి లాక్‌డౌన్: రోజూ 4 గంటలు మినహాయింపు

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 4,723 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,11,711 కి చేరింది.

వీరిలో 4,49,744 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం తెలంగాణలో 59,113 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,834 కి చేరింది. ఈ ఒక్కరోజు రాష్ట్రంలో 5695 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.