హైదరాబాద్ లో పట్టపగలే ఓ దొపిడీ దొంగ రెచ్చిపోయాడు. ఓ ప్రైవేట్ బ్యాంకులో చొరబడి దోపిడికి ప్రయత్నించాడు. అయితే బ్యాంకు సిబ్బంది అప్రమత్తమై దుండగున్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

ఈ ఘటన మణికొండలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలోని కరూర్ వైశ్యా బ్యాంకులో సెక్యూరిటీ కళ్లుగప్పిన ఓ దుండగుడు గన్ తో లోపలికి చొరబడ్డాడు. అనంతరం బ్యాంకు సిబ్బందికి గన్ గురిపెట్టి డబ్బులు ఇవ్వాలని లేదంటే కాల్చేస్తానంటూ బెదిరించాడు. దీంతో అక్కడున్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

అయితే బ్యాంకు సిబ్బందితో పాటు కొందరు ఖాతాదారులు చాకచక్యంగా వ్యవహరించి దొంగను పట్టుకున్నారు. అతడి  వద్ద నుండి గన్ ను లాక్కుని ఎలాంటి ప్రమాదం జరగకుండా చచూసుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దోపిడీ కి ప్రయత్నించిన  దుండగుడిని అదుపులోకి తీసుకుని అతడు తీసుకువచ్చిన గన్ ను స్వాదీనం చేసుకున్నారు. దొంగ వద్ద మారణాయుదం ఉన్నప్పటికి ప్రాణాలకు తెగించి అతన్ని పట్టుకున్న వారిని అబినందించారు.