టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. టీవీ9 లోగోల విక్రయం కేసులో ఆయనకు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చారు. శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు.

కాగా మూడో రోజు రవిప్రకాశ్ సైబరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు విచారిస్తున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు హాజరైన ఆయనను పలు అంశాలపై పోలీసులు ప్రశ్నించారు. అయితే తాము అడుగుతున్న ప్రశ్నలకు రవిప్రకాశ్ సరైన సమాధానాలు చెప్పడం లేదని పోలీసులు పేర్కొంటున్నారు.

27 రోజుల పాటు పరారీలో ఉన్న ఆయన ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం పోలీసుల ఎదుట రవిప్రకాశ్ హాజరయ్యారు. మరోవైపు ఇదే వ్యవహారంలో సినీనటుడు శివాజీ విచారణకు హాజరుకాకపోవడంతో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు.