టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బేరసారాలు ఆడిన ముగ్గురు దళారుల్లో ఒకరు రామచంద్ర భారతికి ఒకటికి మించి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఉన్నట్టు మోయినాబాద్ ఫామ్ హౌజ్‌లో రికవరీ చేసుకున్న డాక్యుమెంట్ల ద్వారా తెలిసింది. దీనిపై బంజారాహిల్స్ పోలీసులు వేరుగా ఒక కేసు నమోదు చేశారు.
హైదరాబాద్: ఒక వైపు మునుగోడు ఉపఎన్నిక ప్రచారం పీక్స్‌లో ఉన్నప్పుడు మోయినాబాద్ ఫాంహౌజ్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల ఘటన బయటకు వచ్చింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలుకు ప్రయత్నించినట్టు చెబుతున్న ముగ్గురిలో ఒకరు రామచంద్ర భారతి దగ్గర ఒకటికి మించి ఆధార్, పాన్ కార్డులు ఉన్నాయని సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి బహిరంగ పరిచిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై బంజారాహిల్స్ పోలీసులు యాక్షన్‌లోకి దిగతారు. రామచంద్ర భారతి దగ్గర ఒకటికి మించి ఆధార్, పాన్ కార్డులు ఉన్న నేరారోపణతో ఆయనపై చీటింగ్ కేసు నమోదు చేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బి హర్షవర్దన్ రెడ్డిలను కొనుగోలు చేయడానికి ఈ ముఠా ప్రయత్నించింది. వీరిని పైలట్ రోహిత్ రెడ్డి ట్రాప్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నిక ముగిసిన తర్వాతే సీఎం కేసీఆర్ ఆ ముగ్గురు దళారులు బేరసారాలు ఆడుతుండగా తీసిన వీడియోలు, డీల్‌లో పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్ చేసిన వివరాలను బయటపెట్టారు. అంతేకాదు, ముగ్గురు దళారుల్లో ఒకరైన రామచంద్ర భారతి దగ్గర ఒకటికి మించి ఆధార్ కార్డు, పాన్ కార్డులు ఉన్నాయని తెలిపారు. వాటి చిత్రాలను కూడా మీడియాకు చూపించారు.
ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి, హైదరాబాద్‌కు చెందిన నంద కుమార్, తిరుపతికి చెందిన సింహాయాజి స్వామిలను ఈ ముగ్గురు దళారులుగా గుర్తించారు. ఈ వ్యవహారం మోయినాబాద్‌లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌజ్‌లో జరిగింది. దీన్ని ఆయన సీక్రెట్‌గా రికార్డు చేశారు. ఆ తర్వాత పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో అక్టోబర్ 26వ తేదీన పోలీసులు ఆ ముగ్గురిని అరెస్టు చేశారు.
Also Read: ఎవరెవరికి ఎంతివ్వాలి: రామచంద్రభారతి, నందకుమార్ ,సింహయాజీల ఫోన్ సంభాషణ
మోయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, రామచంద్ర భారతి దగ్గర ఒకటికి మించి ఆధార్, పాన్ కార్డులు ఉన్నాయనే అంశాన్నీ కూడా ఆ కేసులో చేర్చకుండా.. తాజాగా, బంజారాహిల్స్ పోలీసులు ప్రత్యేక కేసు పెట్టారు.
ఈ కేసు కూడా సైబరాబాద్ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదుపై కాకుండా రోహిత్ రెడ్డి ఇచ్చిన రిప్రెజెంటేషన్ ఆధరాంగా బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
మోయినాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసులో ఈ ముగ్గురు దళారులు ప్రస్తుతం జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ప్రస్తుతానికి ఈ కేసు దర్యాప్తుపై స్టే ఉన్నది. వారిని తమ కస్టడీలోకి తీసుకోవడానికి పోలీసులు ఇంకా కోర్టులో పిటిషన్ వేయాల్సి ఉన్నది.
