చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఎన్నికల సమయంలో పట్టుబడిన డబ్బులకు సంబంధించిన కేసులో నోటీసులు అందించడానికి వెళ్లిన తమపై విశ్వేశ్వర్ రెడ్డి దౌర్జన్యానికి పాల్పడినట్లు బంజారాహిల్స్ ఎస్సై కృష్ణ ఫిర్యాదు చేశారు. గదిలో బంధించి బూతులు తిడుతూ తమ విధులకు ఆటంకం కలిగించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు విశ్వేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా గచ్చిబౌలి ప్రాంతంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపడుతుండగా సందీప్ రెడ్డి అనే వ్యక్తి  రూ.10 లక్షలతో పట్టుబడ్డాడు. ఆ డబ్బులకు సంబంధించి అతడి వద్ద ఎలాంటి పత్రాలు, రశీదులు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకుని సందీప్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణలో అతడు చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగా గుర్తించారు. 

 ఈ మేరకు సందీప్ నుండి కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకొన్నారు. సందీప్ రెడ్డి కోడ్ పద్దతిలో రాసుకొన్న కాగితాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిపుణుల సాయంతో డీ కోడ్ చేశారు. అలాగే అతడివద్ద నుండి మూడు ల్యాప్‌టాప్‌లను కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ మొత్త వ్యవహారంతో విశ్వేశ్వర్ రెడ్డికి సంబంధం వున్నట్లు గుర్తించి  ఆయన కార్యాలయంలో నోటీసులు ఇవ్వడానికి ఎస్సై కృష్ణ తన సిబ్బందితో కలిసి వెళ్లారు. 

అయితే ఈ సమయంలో అక్కడే వున్న విశ్వేశ్వర్‌రెడ్డి తమ విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. డ్యూటీలో వున్న ఎస్సైతో పాటు ఆయన సిబ్బందిపై దౌర్జన్యం చేసినందుకు పోలీసులు విశ్వేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.