తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో తనకు సీటు కచ్చితంగా దక్కుతుందంటూ సినీ నిర్మాత బండ్ల గణేశ్ పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యేలా కనిపిస్తున్నాయి.  ఇటీవల బండ్ల గణేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

కాగా.. ఆ సారి ఎన్నికల్లో తాను పోటీచేస్తానని, రాజేంద్ర నగర్ టికెట్ తనదేనని ఆయన ఢంకా మోగించినట్లు చెప్పుకున్నారు. అయితే.. ఇవేమీ పార్టీ అధిష్టానానికి వినపడినట్లు లేవు. అందుకే కాంగ్రెస్ విడుదల చేసిన రెండు జాబితాలలోనూ బండ్ల గణేశ్ పేరు కనపడలేదు.  అలా అని ఆయన ఆశిస్తున్న రాజేంద్ర నగర్ సీటు వేరే ఎవరికీనూ ఇవ్వలేదు. ప్రస్తుతానికి ఆ సీటు పెండింగ్ లో ఉంచింది. 

గత ఎన్నికల్లో రాజేంద్రనగర్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి ప్రకాశ్ గౌడ్ బరిలోకి దిగి గెలిచారు. అనంతరం ఆయన టీఆర్ఎస్‌లో చేరారు. ఇప్పుడు ఆ పార్టీ తరపున బరిలోకి దిగుతున్నారు. ఇక మహాకూటమిలో మిత్రపక్షమైన టీడీపీ తమకే ఆ టికెట్‌ ఇవ్వాలని పట్టుబడుతోంది. మరోవైపు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కుమారుడు కార్తిక్‌ రెడ్డికి ఈ స్థానం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. 

ఫ్యామిలీకి ఒకే టికెట్‌ సిద్ధాంతమన్నా కాంగ్రెస్‌.. ఇప్పటికే ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి, కోమిటి రెడ్డి బ్రదర్స్‌, మల్లు బ్రదర్స్‌లకు టికెట్లు ఇచ్చింది. దీంతో ఆమె ఈ టికెట్‌ కోసం తీవ్ర కసరత్తులు చేస్తోంది. మరి అధిష్టానం బండ్ల గణేశ్‌కు అవకాశం ఇస్తుందా..? లేక టీడీపీకి వదిలేస్తుందో వేచి చూడాల్సిందే.