ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి  కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయ్యారు. పీపుల్స్ మార్చ్‌ పేరుతో పాదయాత్ర చేస్తున్న సీఎల్పీ నేత మల్ల భట్టి విక్రమార్కను బండ్ల గణేష్ కలిశారు.

ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మరోసారి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయ్యారు. పీపుల్స్ మార్చ్‌ పేరుతో పాదయాత్ర చేస్తున్న సీఎల్పీ నేత మల్ల భట్టి విక్రమార్కను బండ్ల గణేష్ కలిశారు. సూర్యాపేటలో పాదయాత్ర కొనసాగిస్తున్న భట్టి విక్రమార్క‌ను కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనతో కాసేపు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. భట్టి విక్రమార్క్ లాంటి నేతకు మద్దతు తెలుపడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కప్పు కొడుతుందని అన్నారు. 

ప్రపంచంలో భారతదేశానికి గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని చెప్పారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని అన్నారు. కర్ణాటక నుంచి తుపాన్ ప్రారంభమైందని అన్నారు. 150 రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము గొప్పలు చెప్పుకోమని.. డబ్బాలు కొట్టుకోమని.. యాడ్‌లు వేయమని.. సినిమాలు తీయమని.. ప్రజాసేవ మాత్రమే చేస్తామని అన్నారు. తక్కువ మాట్లాడతం.. ఎక్కువ పని చేస్తామని చెప్పారు. ఎక్కువ మాట్లాడి తక్కువ పని చేసే వారి పరిపాలన ఇప్పుడు చూస్తున్నారని.. రాబోయే రోజుల్లో తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసే పాలన చూడబోతున్నారని అన్నారు. 

తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్‌గా వ్యవహరించిన బండ్ల గణేష్.. ఎన్నికల ఫలితాల తర్వాత సెలైంట్‌గా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటే బండ్ల గణేష్.. గత కొద్ది నెలలుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం కూడా.. ‘‘అన్నా వస్తున్నా అడుగులో అడిగేస్తా చేతిలో చెయ్యేస్తా కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అన్నిటికీ సిద్ధపడి తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ఈ అద్భుతమైన పాదయాత్రలో పాలుపంచుకోటానికి మిమ్మల్ని కలవడానికి సూర్యాపేటకు వస్తున్నాను. జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్’’ అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.