Bandi Sanjay : కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఊ అంటే కేంద్రమే కేసీఆర్, కేటీఆర్ ను బొక్కలో వేసేవాళ్లమని… కానీ ఆయన అందుకు రెడీగా లేరని అన్నారు.
KNOW
Bandi Sanjay : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ను ఏర్పాటుచేసి విచారణ జరిపిస్తోంది. తాజాగా ఈ సిట్ విచారణకు కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలు, తనకు తెలిసిన సమాచారాన్ని సిట్ అధికారులకు అందించానని సంజయ్ తెలిపారు. సిట్ విచారణ అనంతరం సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ కూతురు, అల్లుడి ఫోన్లు ట్యాప్ :
గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా దారుణాలు జరిగాయని... మాాజీ సీఎం కేసీఆర్ వావివరసలు మరిచి నీచంగా వ్యవహరించారని బండి సంజయ్ అన్నారు. ప్రతిపక్ష పార్టీలు, సొంత పార్టీ నాయకుల ఫోన్లనే కాదు కన్నకూతురు, అల్లుడి ఫోన్లను కూడా ఆయన ట్యాప్ చేయించారని బండి సంజయ్ అన్నారు. అధికారం కోసం ఇంతటి నీచానికి పాల్పడే నీచులను ఏమనాలో కూడా తెలియడంలేదని బండి సంజయ్ మండిపడ్డారు.
సిట్ విచారణలో తనకు సంచలన విషయాలు తెలిశాయన్నారు కేంద్ర మంత్రి. తన ఫోన్ ప్రతి క్షణం ట్యాప్ అయ్యిందని తెలిసి షాక్ కు గురయ్యానని పేర్కొన్నారు. తనతోపాటు ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేశారని... మమ్మల్ని మావోయిస్టులుగా పేర్కొని ట్యాప్ చేసేందుకు అనుమతులు తీసుకున్నారని సంజయ్ అన్నారు. చివరకు సొంత మేనల్లుడు, తన కేబినెట్ లోనే మంత్రిగా ఉన్న హరీష్ రావు ఫోన్ ను కూడా కేసీఆర్ ట్యాప్ చేయించాడని సిట్ విచారణలో తెలిసిందన్నారు కేంద్ర మంత్రి.
గత బిఆర్ఎస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6,500 ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలుస్తోందని సంజయ్ అన్నారు. సొంత కుటుంబసభ్యులను కేసీఆర్, కేటీఆర్ లు వదిలిపెట్టలేదు... వారి ఫోన్ సంభాషణలను కూడా గుట్టుగా విన్నారన్నారు. చివరకు గ్రూప్ 1 పేపర్ల లీకేజీ వ్యవహారంపై విచారణ చేపట్టిన జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ చేసిన దుర్మార్గుడు కేసీఆర్ అంటూ సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ తో రేవంత్ కుమ్మక్కు :
రాజకీయ నాయకులు, వ్యాపారులు, సినిమావాళ్లు, జడ్జిలే కాదు సొంత కుటుంబసభ్యుల ఫోన్లును కేసీఆర్ ట్యాప్ చేయించారని సంజయ్ అన్నారు. ఈ విషయం ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి తెలుసు... ఆయన ఫోన్ కాల్స్ ను కూడా విన్నారు. కానీ కేసీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా బ్లాక్ మెయిల్స్ చేసి వేలకోట్లు సంపాదించారు... అందులో వాటాకోసమే రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై సీరియస్ యాక్షన్ తీసుకోవడంలేదని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు స్పష్టంగా అర్ధమవుతున్నా సిట్ విచారణ పేరుతో ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని సంజయ్ అన్నారు. ఈ సిట్ వల్ల ఏం జరగదు... అందుకే దీనిపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని సూచించారు. మీరు లేఖ రాస్తే సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. సీబీఐకి నేరుగా విచారణ చేసే అధికారముంటే కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ లను ఎప్పుడో బొక్కలో వేసేవాళ్లమని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు.
బండి సంజయ్ ఇంకా ఏమన్నారంటే...
దేశవ్యాప్తంగా మంచిపేరున్న SIB వ్యవస్థను కేసీఆర్ లాంటివాళ్లు భ్రష్టు పట్టించారని బండి సంజయ్ అన్నారు. ఎస్ఐబీని అడ్డుపెట్టుకుని ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారు... కాల్ రికార్డింగ్ ద్వారా బ్లాక్ మెయిల్ చేసి కాంట్రాక్టర్లను, లీడర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసిన నీచులు గత పాలకులు అంటూ మండిపడ్డారు. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు లాంటి లుచ్చాగాళ్లను ఏం చేసినా తప్పులేదన్నారు.
ఎన్నికల సమయంలో ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి దగ్గర 7 కోట్ల రూపాయలు పట్టుకున్నారని బండి సంజయ్ గుర్తుచేశారు. ఇలా చాలామంది నాయకులకు చెందిన కోట్లాది రూపాయలు పట్టుకున్నారు... ఆ పైసలన్నీ ఎటుపోయాయి... ట్యాపింగ్ గ్యాంగ్ తిన్నదా? ట్విట్టర్ టిల్లు తిన్నడా? తేల్చాలన్నారు. దీనిపై ఈడీకి ఎందుకు లేఖ రాయడం లేదు? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని సంజయ్ ప్రశ్నించారు.
తక్షణమే ఎస్ఐబీని అడ్డుపెట్టుకుని కేసీఆర్, ప్రభాకర్ రావు చేసిన వసూళ్ల పర్వంపై విచారణ జరపాలి... ఈడీకి లేఖ రాస్తే తక్షణమే విచారణ చేయించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కేసీఆర్, కేటీఆర్, సంతోష్ మినహా బీఆర్ఎస్ నేతల ఫోన్లన్నీ ట్యాప్ అయ్యాయి... చివరకు సొంత కూతురు కవిత, మేనల్లుడు హరీష్ రావు ఫోన్లను కూడా ట్యాప్ చేయించిన నీచుడు కేసీఆర్ అంటూ మండిపడ్డారు.
సాక్షాత్తు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా బాధితుడే కదా... మరి ఆయన ఎందుకు సిట్ విచారణకు హాజరు కావడం లేదు? ఎందుకు స్టేట్ మెంట్ ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు. కేసీఆర్ తానా అంటే రేవంత్ తందానా అంటున్నారన్నారు. కేసీఆర్, రేవంత్ ఒక్కటే... అందుకే ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులను అరెస్ట్ చేయడం లేదన్నారు. నిస్పక్షపాతంగా సిట్ విచారణ జరుగుతుందని నమ్మాలంటే సీఎం కూడా వెంటనే సిట్ విచారణకు హాజరై స్టేట్ మెంట్ ఇవ్వాలన్నారు బండి సంజయ్.
ఆనాటి సీఎం కేసీఆర్, ఆయన కొడుకు ట్విట్టర్ టిల్లును పిలిచి విచారించే దమ్ము సిట్ కు ఉందా? అని బండి సంజయ్ నిలదీశారు. దేశవ్యాప్తంగా తెలంగాణ పరువును మంట కలిపిన వ్యవహారమిదని అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకుని అధికారంలోకి వచ్చారు... తర్వాత ఫోన్లను ట్యాప్ చేస్తూ ప్రజల ఎమోషన్ తో ఆడుకున్నారని అన్నారు. సాక్షాత్తు ఆనాటి రాష్ట్ర ప్రభుత్వమే తెలంగాణ పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాసేలా నీచానికి పాల్పడిందని బండి సంజయ్ మండిపడ్డారు.
బండి సంజయ్ వీడియోను ఇక్కడ చూడండి

