మహిళలపై అత్యాచారాలకు నిరసనగా దీక్షకు సిద్దమైన బండి సంజయ్.. వివరాలు ఇవే..
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరో దీక్షకు సిద్దమయ్యారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనకు ఈ నెల 6వ తేదీన నిరసన చేపట్టాలని నిర్ణయించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరో దీక్షకు సిద్దమయ్యారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనకు ఈ నెల 6వ తేదీన నిరసన చేపట్టాలని నిర్ణయించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఇటీవల నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మహిళా మోర్చా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలపై సీఎం కేసీఆర్, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ప్రతి రోజూ మహిళలపై నేరాలు జరుగుతున్నాయన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇలాంటి నేరస్తుల జీవితాలను నరకం చేస్తామని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో మాదిరిగానే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే నేరస్తులందరి ఇళ్లను బుల్‌డోజర్‌లో ధ్వంసం చేస్తామని అన్నారు.
వరంగల్ మెడికో ప్రీతి ఘటన నుంచి జూబ్లీహిల్స్‌లో జరిగిన అత్యాచారం వరకు సీఎం ఏమీ మాట్లాడలేదన్నారు. ప్రజలు ఇప్పుడు బీజేపీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని.. తమ పార్టీ అధికారంలో ఉంటే గౌరవంగా జీవించగలమని మహిళలు విశ్వసిస్తున్నారని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ కూతురు కవితను మాత్రమే పట్టించుకుంటున్నారని మండిపడ్డారు. రక్షణ, పదవులు అన్నీ ఆమెకు మాత్రమేనని.. వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను బీఆర్‌ఎస్ గూండాలు అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి అవమానాలు ఎదురైనా మౌనంగా ఉండాల్సిన అవసరం లేదని బండి సంజయ్ అన్నారు.