Asianet News TeluguAsianet News Telugu

రేపటినుంచి బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర.. 24 రోజులపాటు సాగనున్న యాత్ర...

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర మూడో విడత రేపటినుంచి ప్రారంభం కానుంది. యాదగిరి గుట్టలో మొదలుపెట్టనున్నారు. 
 

bandi sanjay third phase praja sangrama yatra starts from tomorrow
Author
Hyderabad, First Published Aug 1, 2022, 10:46 AM IST

హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించనున్నారు. మంగళవారం నుంచి నిర్వహించే పాదయాత్ర సందర్భంగా... నేడు సోమవారం మహా శక్తి అమ్మవారి ఆలయంలో ఆయన అమ్మవారి ఆశీస్సులు తీసుకోనున్నారు. మూడో విడత ప్రజా సంకల్ప యాత్ర ఆగస్టు 2న యాదగిరిగుట్ట నుంచి ప్రారంభమై 26వ తేదీన హనుమకొండ భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గర ముగియనుంది. 24 రోజుల పాటు 125 గ్రామాల మీదుగా మూడు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్ పూర్, వర్ధన్నపేట, పరకాల వెస్ట్, వరంగల్ ఈస్ట్ నియోజక వర్గాల్లో పాదయాత్ర చేపట్టనున్నారు.

నిరుడు ఆగస్టు 28న హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి తొలివిడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించిన బండి సంజయ్ హుస్నాబాద్ లో ముగించిన విషయం తెలిసిందే. ముప్పై ఆరు రోజుల పాటు 8 జిల్లాలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలు, 6 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 438 కిలోమీటర్ల దూరం బండి సంజయ్ పాదయాత్ర చేపట్టారు. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను గద్వాల జిల్లా అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయం వద్ద నుంచి ప్రారంభించారు. 31 రోజులపాటు పాదయాత్ర కొనసాగేలా ప్రణాళిక రూపొందించారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ ఛుగ్ సమక్షంలో పాదయాత్ర ప్రారంభమైంది. రెండో పాదయాత్ర హైదరాబాద్ శివారు ప్రాంతం తుక్కుగూడ వద్ద నిర్వహించిన పార్టీ బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరైన విషయం తెలిసిందే.

బండి సంజయ్‌కి నరేంద్ర మోడీ ఫోన్: కష్టపడి పోన్ చేస్తున్నావని అభినందన

ఇదిలా ఉండగా, రెండో విడత పాదయాత్ర తరువాత మే 15న బండి  సంజయ్ కి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర రెండో విడత విజయవంతం కావడంపై మోడీ అభినందించారు. బండి సంజయ్ కష్టపడి పని చేస్తున్నారని ప్రధాని అభినందించారు. దీంతోపాటు ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేసిన బీజేపీ కార్యకర్తలను కూడా మోడీ ప్రశంసించారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపును పురస్కరించుకొని తుక్కుగూడలో బీజేపీ సభను నిర్వహించింది. ఈ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్న సంగతి తెలిసిందే. 

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బీజేపీ ఇప్పటినుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని కూడా బండి సంజయ్ భావిస్తున్నారు. ఇప్పటికే రెండు విడతలుగా బండి సంజయ్ పాదయాత్ర నిర్వహించారు. ఈ యేడాది ఏప్రిల్ 14న జోగులాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిచిన బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను  ప్రారంభించారు. ఈ యాత్ర మే 14తో ముగిసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios