Asianet News TeluguAsianet News Telugu

సిద్ధాంతాలను వదిలిపెట్టలేదు.. అందుకే బీజేపీ ఈ స్థాయికి : బండి సంజయ్

శామీర్‌పేటలో మూడు రోజుల పాటు జరిగే బీజేపీ శిక్షణా తరగతులను తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. బీజేపీ ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ముందుకు పోతోందన్నారు బండి సంజయ్.

bandi sanjay speech at BJP Three Days Training Camp In Shamirpet
Author
First Published Nov 20, 2022, 3:24 PM IST

బీజేపీ ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ముందుకు పోతోందన్నారు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ఆదివారం నుంచి శామీర్‌పేటలో మూడు రోజుల పాటు జరిగే బీజేపీ శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ... పార్టీని బలోపేతం చేసేందుకు అనేకమంది కార్యకర్తలు త్యాగాలు చేశారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజలతో మరింతగా మమేకమవుతామని... సభలు, సమావేశాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు పార్లమెంట్‌లో రెండు సీట్లతో వున్న బీజేపీ.. నేడు 303 స్థానాలను గెలిచే స్థాయికి చేరిందన్నారు. అధికారంలోకి రావాలనుకున్నాం కానీ.. అడ్డదారుల్లో దానిని సాధించాలని అనుకోలేదని బండి సంజయ్ గుర్తుచేశారు. ఈ మూడు రోజులూ 14 అంశాలపై నేతలకు శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు. 

మరోవైపు... ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను నవంబర్ 28 నుంచి ఆదిలాబాద్ జిల్లా భైంసా నుంచి ప్రారంభిస్తున్నట్లు ఇప్పటికే బండి సంజయ్ వెల్లడించారు. అక్కడ బహిరంగ సభలో రామారావు పటేల్‌ను పార్టీలోకి చేర్చుకుంటారని పార్టీ సభ్యులు తెలిపారు. కాగా, రామారావు పటేల్ రెండు రోజుల క్రితం కాంగ్రెస్  పార్టీకి గుడ్ బై చెప్పిన సంగ‌తి తెలిసిందే. నిర్మల్, ఖానాపూర్, బాదన్‌కుర్తి, కోరుట్ల, జగిత్యాల, చొప్పదండి, కరీంనగర్ రూరల్, కరీంనగర్‌లో 16 రోజుల పాటు బీజేపీ ప్ర‌జా సంగ్రామ యాత్ర సాగనుంది. 

ALso Read:న‌వంబర్ చివరిలో భైంసా నుంచి బండి సంజ‌య్ ప్ర‌జా సంగ్రామ యాత్ర..

ఇదిలావుండ‌గా, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదేశానుసారం టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేశారని బండి సంజ‌య్ ఆరోపించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) క్షమాపణ చెప్పాలని శనివారం డిమాండ్ చేశారు. తన కుమార్తెను రాజకీయంగా అదుపు తప్పకుండా చేయడంతో సహా అన్ని విష‌యాల్లోనూ కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. శనివారం హైద‌రాబాద్ లోని అరవింద్ నివాసాన్ని సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడిన బండి సంజయ్.. ఘటనపై కేసీఆర్ స్ప‌దించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసుల సాయంతో టీఆర్‌ఎస్‌ గూండాలు బీజేపీ ఎంపీ నివాసంపై దాడి చేశారని ఆరోపించారు. దాడిని అడ్డుకోవడంలో విఫలమైన పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న కొందరు పోలీసు అధికారులు యూనిఫారానికి బదులు గులాబీ రంగు దుస్తులు ధరించాలంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

‘రాజకీయాల్లో భౌతిక దాడుల సంస్కృతి మంచిది కాదు. బీజేపీ కార్యకర్తలు అతిగా ప్రవర్తించినా నేను దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తాను' అని  బండి సంజ‌య్ అన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారనీ, ప్రతిపక్షాలపై కుట్రలు చేయకుండా ఎన్నికల హామీలను నెరవేర్చడంపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని సూచించారు. దాడి విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు సంజయ్ తెలిపారు. బీజేపీ కార్యకర్తలపై టీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న నిరంతర దాడుల గురించి కూడా వివరించామని చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios