తెలంగాణ విమోచన దినోత్సవం జరపకపోవడం మోసం చేయడమే: అమెరికాలో బండి సంజయ్
తెలంగాణ విమోచన దినోత్సవం జరపకోవడమంటే.. రాష్ట్ర ప్రజలను కేసీఆర్ మోసం చేయడమేనని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ నిర్వహించిన కార్యక్రమంలో బండి సంజయ్ న్యూజెర్సీలో మాట్లాడారు.

న్యూఢిల్లీ: తెలంగాణ బీజేపీ నేత, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదరశి బండి సంజయ్ అమెరికాలో ఎన్నారైలు, పార్టీ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఆధ్వర్యంలో హాలిడే ఇన్ హాజలెట్ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం నిర్వహించకుంటే అది తెలంగాణ ప్రజలను మోసం చేయడమే అవుతుందని కామెంట్ చేశారు. నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా ఎందరో సాయుధ పోరాటాలు చేశారని, చాలా మంది ప్రాణాలు అర్పించారని బండి సంజయ్ అన్నారు. అలాంటి అమరవీరుల త్యాగాలను విస్మరించడం కేసీఆర్‌కు తగదని ఫైర్ అయ్యారు. న్యూజెర్సీలో ఆత్మీయ సమ్మేళం (మీట్ అండ్ గ్రీట్) కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి యేటా అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి జరుగుతున్న అభివృద్ధి ఏమీ లేదని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతి తప్పితే అభివృద్ధి చేయలేని మండిపడ్డారు. అలాగే, ఇండియాను భారత్‌గా పిలుచుకోవాలని ఆయన వారిని కోరారు.
తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ దివంగత నేత సుష్మా స్వరాజ్ ముఖ్య కారణం అని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ యువత ప్రాణ త్యాగం చేస్తూ ఉంటే ఆమె తల్లడిల్లిపోయారు. తెలంగాణ తప్పక వస్తుందని, దాన్ని మీరు బతికి చూడాలని కోరారని గుర్తు చేశారు.
సనాతన ధర్మం గొప్పతనాన్ని, అయోధ్య రాముడి గురించి, ట్రిపుల్ తలాఖ్, ఆర్టికల్ 370ల గురించి బండి సంజయ్ మాట్లాడారు.
ఆఫ్ బీజేపీ పూర్వ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఏనుగుల మాట్లాడుతూ.. బండి సంజయ్ కృషి గురించి పొగిడారు. ఆఫ్ బీజేపీ అధ్యక్షుడు అడపా ప్రసాద్ గారి తరఫున కేంద్రం తెలంగాణకు చేస్తున్న పనులను వివరించారు.
తెలంగాణ ఆఫ్ బీజేపీ కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల.. బండి సంజయ్ గురించి హుషారుగా మాట్లాడారు. హిందు హృదయ సామ్రాట్ అంటూ ప్రశంసలు కురిపించారు. కమలదళపతి అని అన్నారు. బండి సంజయ్ అంటే తమకు అభిమానం అని, ఆయన గురించి న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డులో బండి సంజయ్ ఫొటోలను చూపించామని, మీడియాలోను ఆయనకు మద్దతు ఇస్తూ ప్రకటనలు ఇచ్చామని చెప్పారు.