తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆ పదవికి రాజీనామా చేసినట్టుగా ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్టోబర్ 31వ తేదీనే రాసినట్లుగా ఉన్న ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆ పదవికి రాజీనామా చేసినట్టుగా ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్టోబర్ 31వ తేదీనే రాసినట్లుగా ఉన్న ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ప్రచారంలో ఉన్న లేఖపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఫామ్‌హౌస్ డ్రామా ఫ్లాప్ కావడంతో విసుగు చెందిన టీఆర్ఎస్ మోసగాళ్లు ఇప్పుడు నకిలీ లేఖను విడుదల చేశారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

మునుగోడులో బీజేపీ రికార్డు విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతో టీఆర్ఎస్ చేస్తున్న అబద్దాల ప్రచారాలు నవంబర్ 3తో ముగుస్తాయని అన్నారు. ఇది కేసీఆర్ ప్రజా జీవితానికి నిజమైన రాజీనామాకు దారి తీస్తుందని అన్నారు. టీఆర్ఎస్‌కు రోజులు పడ్డాయని విమర్శించారు. ఈ మేరకు బండి సంజయ్ ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు.

Scroll to load tweet…


ఇదిలా ఉంటే.. బండి సంజయ్ రాజీనామా పేరుతో ఫోర్జరీ లేఖను సృష్టించిన వారిపై ఎన్నికల సంఘానికి, పోలీసులుకు బుధవారం ఫిర్యాదు చేయనున్నట్టుగా బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 

ఇక, బండి సంజయ్ పేరుతో వైరల్ అవుతున్న ఫోర్జరీ లేఖలో.. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం పార్టీ శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నారని.. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారని.. అయితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొవాల్సి వస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు బండి సంజయ్ సమాచారం ఇచ్చినట్టుగా ఉంది. ఎన్నికల ఫలితాలు మనకు అనుకూలంగా లేనందున మునుగోడు నియోజకవర్గంలో ప్రచారానికి దూరంగా ఉండాలని అన్ని కేంద్ర నాయకత్వాలకు సూచించానని చెప్పినట్టుగా ఉంది. మునుగోడులో పార్టీకి ఓటమి ఎదురు కానుందని.. అందుకు బాధ్యత తనదేనని బండి సంజయ్ వివరిస్తున్నట్టుగా లేఖలో పొందుపరిచారు.