తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పోరాటం ఉధృతం చేశారు. ప్రభుత్వ శాఖల్లో సమాచారం కోరుతూ ఆర్టీఐ కింద పదుల సంఖ్యలో దరఖాస్తులు చేశారు.
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పోరాటం ఉధృతం చేశారు. ప్రభుత్వ శాఖల్లో సమాచారం కోరుతూ ఆర్టీఐ కింద పదుల సంఖ్యలో దరఖాస్తులు చేశారు. పలు అంశాల మీద ప్రభుత్వ శాఖల నుంచి సమాచారం కోరారు. 8 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను వెలికితీయడంలో భాగంగా బండి సంజయ్ ఈ దరఖాస్తులు చేసినట్టుగా తెలుస్తోంది. గత నెల 28న 88 అంశాలపై బండి సంజయ్ ఆర్టీఐ కింద దరఖాస్తులు దాఖలు చేశారు. ప్రగతి భవన్ నిర్మాణం నుంచి మీడియా ప్రకటనల వరకు వివరాలను బండి సంజయ్ ఆర్టీఐ కింద కోరినట్టుగా తెలుస్తోంది.
సీఎం కేసీఆర్ సచివాలయానికి ఎన్ని రోజులు హాజరయ్యారనే వివరాలను కూడా బండి సంజయ్ కోరారు. 2014 జూన్ 2 నుంచి 2002 జూన్ 2 వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు, వాటి అమలుకు సంబంధించిన వివరాలను తెలపాలని కూడా బండి సంజయ్ దరఖాస్తు చేశారు. అలాగే కేసీఆర్.. ఎన్ని రోజులు ప్రగతి భవన్‌లో ఉన్నారు, ఫామ్ హౌస్‌లో ఎన్ని రోజులు ఉన్నారనే దానిపై సమాచారం ఇప్పించాల్సిందిగా కోరారు.
భర్తీ చేసిన ఉద్యోగాలు, గ్రామ పంచాయితీలకు కేటాయించిన నిధులు, రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు, కేసీఆర్ జీతభత్యాలు, పర్యటనల వివరాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ వివరాలు, రైతుల రుణమాఫీ, కార్పొరేషన్‌లకు కేటాయించిన నిధులు, సబ్సీడీ రుణాలు.. ఇలా పలు అంశాలపై వివరాలు అందజేయాల్సిందిగా బండి సంజయ్ ఆర్టీఐ కింద దరఖాస్తులు దాఖలు చేశారు.
