కరీంనగర్: 1992 అయోధ్యలో కరసేవలో పాల్గొన్న తొలి బ్యాచ్ కరసేవకుడే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయోధ్యలో రామ జన్మభూమి న్యాస్‌కే వివాదాస్పద భూమిని కేటాయిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును శనివారం నాడు ఇచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలో ఆనాడు కరసేవలో పాల్గొన్న ఎంపీ సంజయ్ మిత్రులు తమ పాత గుర్తులను నెమరు వేసుకొంటూ సోషల్ మీడియాలో ఆనాటి ఫోటోలను షేర్ చేశారు.

1992 లో ప్రధానిగా పీవీ నరసింహారావు ఉన్నారు. అయితే ఆనాడు ఉమ్మడి ఏపీ రాష్ట్రం నుండి కరసేవకు పెద్ద ఎత్తున తరలి రావాలని బీజేపీ నాయకత్వం ఆదేశించింది. ప్రధానిగా ఉన్న పీవీ నరసింహారావు స్వంత జిల్లా నుండే పెద్ద ఎత్తున రావాలని కూడ ఆదేశాలు జారీ చేసింది.

పీవీ స్వంత జిల్లా కరీంనగర్ కావడంతో మొదటి కరసేవకులు కరీంనగర్ నుండే బయలుదేరినట్టుగా ఎంపీ బండి సంజయ్ గుర్తు చేసుకొన్నారు. తొలుత తనతో పాటు 15 మంది అయోధ్యలో కరసేవకు బయలు దేరినట్టుగా ఆయన చెప్పారు.

కరసేవకు వెళ్లిన తమకు మొదటి నాలుగు రోజుల పాటు అన్న పానీయాలు కూడ లేవన్నారు. నాలుగు రోజుల పాటు తాము టీ, బిస్కట్లతోనే సరిపెట్టుకొన్నట్టుగా సంజయ్ ఆనాటి ఘటనలను నెమరువేసుకొన్నారు.నాలుగు రోజుల తర్వాత ఇతర ప్రాంతాల నుండి కూడ పెద్ద ఎత్తున కరసేవకులు రావడంతో భోజన ఏర్పాట్లు చేశారని చెప్పారు.