Asianet News TeluguAsianet News Telugu

నా భద్రతను కార్యకర్తలే చూసుకుంటారు: పోలీస్ సెక్యూరిటీని నిరాకరించిన బండి సంజయ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్.. పోలీస్‌ సెక్యూరిటీని నిరాకరించారు. భద్రతా సిబ్బందిని ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు.

Bandi Sanjay refused police security
Author
First Published Aug 15, 2022, 1:58 PM IST

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర జనగామ జిల్లా దేవరుప్పులలో  సాగుతున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బండి సంజయ్ ప్రసంగిస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యోగాలపై ప్రశ్నించారు. ఈ క్రమంలోనే బీజేపీ, టీఆర్ఎస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అయితే ఈ పరిణామాలపై బండి సంజయ్‌ సీరియస్ అయ్యారు. సీపీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దమ్ముంటే కేసీఆర్ రాజీనామా చేయాలని బండి సంజయ్ సవాలు విసిరారు.

ఈ క్రమంలోనే బండి సంజయ్.. పోలీస్‌ సెక్యూరిటీని నిరాకరించారు. భద్రతా సిబ్బందిని ఉపసంహరించుకోవాలని స్పష్టం చేశారు. తన భద్రతను తమ పార్టీ కార్యకర్తలే చూసుకుంటారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటన జరిగిన తర్వాత డీజీపీకి ఫోన్ చేసిన బండి సంజయ్.. లా అండ్ అర్డర్ చేతకాకుంటే ఇంట్లో కూర్చొవాలని అన్నారు. పాదయాత్ర ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరారు. దాడి ఘటనపై వెంటనే డీజీపీ స్పందించాలని డిమాండ్ చేశారు. లేదంటే గాయపడిన కార్యకర్తలను మీ వద్దకు తీసుకోస్తామని చెప్పారు.

అసలేం జరిగిందంటే.. 
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా దేవరుప్పులలో బండి సంజయ్ మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజవర్గంలో అభివృద్ది జరగలేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. అయితే బండి సంజయ్ కామెంట్స్‌పై అక్కడికి చేరుకున్న టీఆర్ఎస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసకుంది. ఇది కాస్తా టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. 

దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మద్య రాళ్ల దాడిలో పలువురికి గాయాలు అయ్యాయి.

Follow Us:
Download App:
  • android
  • ios