గడిచిన ఏడేళ్లుగా ఉద్యోగాల నియామకాల కోసం ఎదురుచూస్తున్న యువతీ, యువకులకు ఇటీవల ప్రభుత్వం చేసిన ప్రకటన కొంత ఊరటనిచ్చిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. అయితే పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే వారి కోసం స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే వారి కోసం స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ యువతీ యువకులకు అసెంబ్లీ నియోజకవర్గానికొక స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేయాలన్నారు. కోచింగ్‌ కేంద్రాల్లో అల్పాహారం, భోజనం ప్రభుత్వమే కల్పించాలన్నారు. ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి వల్ల తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల వల్ల యువతీ, యువకులు పోటీపరీక్షల కోసం పెద్ద ఎత్తున ఖర్చుపెట్టే పరిస్థితి లేదన్నారు. 

గడిచిన ఏడేళ్లుగా ఉద్యోగాల నియామకాల కోసం ఎదురుచూస్తున్న యువతీ, యువకులకు ఇటీవల ప్రభుత్వం చేసిన ప్రకటన కొంత ఊరటనిచ్చిందన్నారు. టీశాట్‌, ప్రభుత్వ స్టడీ సర్కిల్స్‌, కోచింగ్‌ కేంద్రాల ద్వారానే శిక్షణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లా, నియోజకవర్గ కేంద్రాలలో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలన్నారు. నిరుద్యోగ యువతకు అవసరమైన కోచింగ్‌ మెటీరియల్‌ ఉచితంగా అందించాలని కోరారు. 

రాష్ట్రంలో టెట్ పరీక్ష నిర్వహించి చాలా ఏళ్లు గడిచిందని.. దీనివల్ల ఈ కాలంలో డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌లో నిరాశపడకుండా చూడాల్సి బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అందుకే వెంటనే టెట్‌ ఎంట్రన్స్‌ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. 

ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు తమ ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ నిరుద్యోగ యువతను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని చెప్పారు. ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్లలో ఫీజులను నియంత్రించాలని బండి సంజయ్ కోరారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి ఫీజులను నియంత్రించాలన్నారు. 

ఉద్యోగ నియామకాలకు వయోపరిమితిని సడలించడం ఆహ్వానించదగిన పరిణామం అన్నారు. అయితే 49 ఏళ్లకు ఉద్యోగం పొందేవారికి పెన్షన్ తదితర రిటైర్‌మెంట్ బెనిఫిట్స్‌లో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు.