Asianet News TeluguAsianet News Telugu

ఆ విషయంలో ద్వంద్వ వైఖరి మానుకోవాలి : సోనియా గాంధీపై బండి సంజయ్ ఫైర్

మహిళా బిల్లు విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ద్వంద్వ విధానాలను మానుకోవాలనీ,  అంతకంటే ముందే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించి ఆయా పార్టీలు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంజయ్ సవాల్ విసిరారు.

Bandi Sanjay Kumar Slams Sonia Gandhi And Congress Party Regarding Womens Reservation Bill KRJ
Author
First Published Sep 20, 2023, 3:07 AM IST | Last Updated Sep 20, 2023, 3:07 AM IST

మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టడం సంతోషంగా ఉందని, బిల్లు ప్రవేశపెట్టడమే బీజేపీ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ అన్నారు. ఈ సందర్బంగా ప్రధాని మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచన దాదాపు 5 దశాబ్దాల నాటిదనీ,  1975లోనే లోక్‌సభలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే చర్చ జరిగిందని గుర్తు చేశారు. అయితే.. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి వల్ల గత మూడు దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి నోచుకోవడం లేదని మండిపడ్డారు.

మాజీ ప్రధాని వాజ్ పేయి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం 1998 జూలైలో తొలిసారిగా మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ.. ఆ సమయంలో కాంగ్రెస్, ఆర్జేడీ సహా పలు విపక్ష పార్టీలు వ్యతిరేకించడంతో ఈ బిల్లు ఆమోదం పొందలేదని అన్నారు. ఆ తరువాత కూడా మాజీ ప్రధాని వాజ్ పేయి పట్టు వీడకుండా.. మరో మూడుసార్లు మహిళా బిల్లు ప్రవేశపెట్టినా..  కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చేసిన కుట్రల వల్ల మహిళా బిల్లు ఆమోదం పొందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపైనా నిప్పులు చెరిగారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కాంగ్రెస్, సోనియా గాంధీ వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మహిళా వ్యతిరేకి అంటూ విరుచుకుపడ్డారు. యూపిఎ ఛైర్ పర్సన్‌గా పదేళ్ల పాటు పదవీలో ఉన్న సోనియా గాంధీ కూడా ఏ రోజు కూడా ఈ బిల్లు గురించి ఆలోచించలేదనీ, యూపీఏ కూటమికి పూర్తి మెజారిటీ ఉన్నా.. మహిళా బిల్లును ఆమోదించలేక పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ విషయంలోనే కాంగ్రెస్ పార్టీని మహిళా వ్యతిరేకి అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని అన్నారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి పార్లమెంట్ లో పూర్తిస్థాయిలో మెజారిటీ ఉన్నందున మహిళా బిల్లు ఆమోదం పొందడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ వ్యతిరేకించినా బిల్లును ఆపడం సాధ్యం కాదని అన్నారు.

మహిళా బిల్లును వ్యతిరేకించిన  నేతలు .. మహిళా ద్రోహులుగా  పార్టీగా చరిత్రలో మిగిలిపోతుందన్నారు. మహిళా బిల్లు విషయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ద్వంద్వ విధానాలను మానుకోవాలనీ,  అంతకంటే ముందే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించి ఆయా పార్టీలు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios