ఎన్నికలప్పుడు డ్రామాలు వేయడం, అసత్యాలు ప్రచారం చేయడం, దొంగ దీక్షలు చేయడం బండి సంజయ్ కు వెన్నతో పెట్టిన విద్య అని కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఎద్దేవా చేశారు. దుబ్బాక ఎన్నికల్లో డబ్బులతో ఓటర్లనుప్రలోభపెట్టి, గెలువాలనుకుంటే బండి సంజయ్ కు భంగపాటు తప్పదని హెచ్చరించారు. 

ఎన్నికలు జరిగే జిల్లాలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుందని తెలియక పోవడం కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. బీజేపీ కార్యకర్తలే పోలీసులపై దాడి చేసి, డబ్బులు ఎత్తుకెళ్లారు. ఇప్పుడేమో బండి సంజయ్ దొంగ దీక్ష చేస్తున్నారని అన్నారు. 

అభివృద్ది అజెండాతో టీఅర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేస్తుంటే బండి సంజయ్ అశాంతి, ఆరాచకం అజెండాను నమ్ముకున్నారన్నారు. దుబ్బాక ఉపఎన్నికల్లో టీఅర్ఎస్ గెలుపు ఖాయమైందన్నారు. ఇదివరకే 3 సార్లు డిపాజిట్ కోల్పోయిన బీజేపీ అభ్యర్థి రఘనందన్ రావు డిపాజట్ దక్కించుకునేందుకే ఈ డ్రామాలు చేస్తున్నారని తెలిపారు.