ఎన్నికలకు ముందు లేదంటే తర్వాత... బిఆర్ఎస్ తో బిజెపి పొత్తు ప్రచారం..: బండి సంజయ్ క్లారిటీ
కాంగ్రెస్ ను ఓడించడమే లక్ష్యంగా బిఆర్ఎస్ పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుంటుందంటూ జరుగుతున్న ప్రచారంపై బండి సంజయ్ స్పందించారు.

అమెరికా : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బిజెపి, బిఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంపై బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పందించారు. ఎన్నికల్లోనే కాదు ఆ తర్వాత కూడా బిఆర్ఎస్ తో బిజెపి పొత్తు వుండబోదని స్పష్టం చేసారు. మజ్లిస్ పార్టీతో అంటకాగుతున్న బిఆర్ఎస్ ను బిజెపి దగ్గరకు కూడా రానివ్వదని...అలాంటిది పొత్తు ఎలా సాధ్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్దికోసమే బిఆర్ఎస్ తో బిజెపి పొత్తు అంటూ ప్రచారం చేస్తోందని... కానీ ఆ ఆలోచనే తమ పార్టీకి లేదని బండి సంజయ్ తెలిపారు.
ప్రస్తుతం అమెరికా పర్యటనలో వున్న బండి సంజయ్ నార్త్ కరోలినా రాష్ట్రంలోని చార్లోటే లో జరిగిన 'ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బిజెపి' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ... తాను ఎమ్మెల్యేగా పోటీచేయాలా లేక తిరిగి ఎంపీగానే పోటీ చేయాలా? అన్నది బిజెపి హైకమాండ్ నిర్ణయిస్తుందని అన్నారు. తనను ఎక్కడ ఉపయోగించుకోవాలని పార్టీ పెద్దలకు బాగా తెలుసని... జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా నిర్ణయమే శిరోధార్యమని అన్నారు. తెలంగాణతో పాటు తిరిగి దేశంలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని... పదవుల గురించి ఆలోచించనని బండి సంజయ్ అన్నారు.
కుటుంబ పాలన కారణంగా దేశం అన్నిరంగాల్లో దిగజారిపోయిన విపత్కర స్థితిలో బిజెపి అధికారంలోకి వచ్చిందని సంజయ్ అన్నారు. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టి పాలనను గాడిలో పెట్టారని... అవినీతిరహిత సంక్షేమ పాలన అందిస్తున్నారని అన్నారు. దీంతో ఈ పదేళ్లలో దేశం అభివృద్ది బాటలోనే నడిచిందని... అవినీతి, కుంభకోణాల ఆరోపణలు చేయడానికి కూడా ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా పోయిందన్నారు.
Read More అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మరింత వేగవంతం: మూడో రోజూ స్క్రీనింగ్ కమిటీ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీ 140మంది భారతీయులను కుటుంబంగా భావిస్తున్నారని... వారికోసం ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నారని సంజయ్ అన్నారు. రోజుకు 18 గంటలు కష్టపడుతూ భారత దేశాన్ని అత్యున్నత శిఖరాలకు చేర్చారన్నారు. కరోనా సమయంలో అగ్రదేశాల ఆర్థిక పరిస్థితి దిగజారినా మోదీ పాలనలో భారత్ ఆత్మనిర్భరత చూపించిందన్నారు. ఆపదలోనూ అవకాశాలు వెతికే సమర్థ నాయకత్వం వుండబట్టే కరోనా సమయంలోనూ భారత్ అన్నిరంగాల్లో స్వయం సమృద్ది సాధించిందని సంజయ్ అన్నారు.
వేగంగా అభివృద్ది చెందుతున్న మాతృదేశం కోసం ప్రవాసీ బారతీయులు ముందుకు రావాలని సంజయ్ సూచించారు. విదేశాల్లో స్థిరపడ్డ ఎన్నారైలు స్వదేశంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. దేశం కోసం పాటుపడుతున్న మోదీని మరోసారి ప్రధానిని చేయాలని... ఇందుకోసం రానున్న ఎన్నికల్లో బిజెపికి మద్దతుగా నిలవాలని బండి సంజయ్ ఎన్నారైలను కోరారు.