సారాంశం

బీజేపీ  జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ నూతన జాతీయ కమిటీని ఈరోజు ప్రకటించారు.

న్యూఢిల్లీ: బీజేపీ  జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ నూతన జాతీయ కమిటీని ఈరోజు ప్రకటించారు. కొత్త జాబితాలో 13 మందిని ఉపాధ్యక్షులుగా, తొమ్మిది మందిని ప్రధాన కార్యదర్శులను నియమించారు. తెలంగాణ నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలుగా ఉన్న డీకే అరుణను ఆ పదవిలో కొనసాగించారు. కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించారు. ఇక, ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్య కుమార్.. అదే పోస్టులో కొనసాగించారు. 

అలాగే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా(సంస్థాగత) బీఎల్ సంతోష్, సంస్థాగత వ్యవహారాల ఉప ప్రధాన కార్యదర్శిగా శివప్రకాష్‌లను కొనసాగించారు. బీజేపీ జాతీయ కార్యదర్శులుగా 13 మందికి చోటుకల్పించారు. 

ఇక, బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఎమ్మెల్సీ, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) మాజీ వైస్‌ఛాన్సలర్‌ తారిఖ్‌ మన్సూర్‌ నియమితులయ్యారు. బీజేపీ కొత్త ప్రధాన కార్యదర్శుల జాబితాలో బండి సంజయ్‌తో పాటు రాజ్యసభ ఎంపీ రాధామోహన్ అగర్వాల్ కూడా ఉన్నారు. ఇక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాంలలో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. బీజేపీ తన జాతీయ కమిటీలో ఈ మార్పులు చేసినట్టుగా తెలుస్తోంది. ఇదిలాఉంటే, జేపీ నడ్డా శుక్రవారం రోజున పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో దాదాపు నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. రానున్న లోక్‌సభ ఎన్నికలు, ఎన్‌డీఏ సమావేశం, విస్తృత వ్యూహాలు, ఐదు రాష్ట్రాల ఎన్నికల పోరుతో సహా కీలకమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.

ఈ సమావేశంలో జేపీ నడ్డా బీజేపీ "మహా జన్ శంపర్క్ అభియాన్" పురోగతిని సమీక్షించారు. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించి పార్టీ బ్లూప్రింట్, లోక్‌సభ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చ జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్‌ సంతోష్‌, జాతీయ జాయింట్ ఆర్గనైజేషనల్ సెక్రటరీ వీ సతీష్‌తో పాటు ప్రధాన కార్యదర్శులు అరుణ్ సింగ్, సునీల్ బన్సల్, వినోద్ తావ్డే, తరుణ్ చుగ్, కైలాష్ విజయవర్గియా, ఢిల్లీ షౌకీన్, దుష్యంత్ గౌతమ్‌లు హాజరయ్యారు.