కర్ణాటక ఎన్నికల్లో హిందుత్వం ఓడిపోయిందని పలువురు నేతలు,  కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. కుహానా లౌకికవాదుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. 

కరీంనగర్: కర్ణాటక ఎన్నికల్లో హిందుత్వం ఓడిపోయిందని పలువురు నేతలు, కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. కుహానా లౌకికవాదుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కరీంనగర్‌లో ఆదివారం రోజున అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మతో కలిసి బండి సంజయ్ హిందూ ఏక్తా యాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో హిందూ ఐక్యత ఉందన్నారు. తాను ఎవరికీ వ్యతిరేకంగా హిందూ ఏక్తాయాత్ర చేయడం లేదని.. హిందూ సమాజాన్ని సంఘటిత పర్చేందుకు చేపట్టానని తెలిపారు. ఈ యాత్రతో రాష్ట్రంలో హిందూ సమాజాన్ని జాగృతపరుస్తామని చెప్పారు. దేశంలో హిందుత్వం లేకుంటే ఎప్పుడో పాకిస్తాన్ లాంటి పరిస్థితులు వచ్చేవని అన్నారు. 

కర్ణాటకలో మొన్నటి వరకు భారత్ మాతా కీ జై, జై భజరంగబలి నినాదాలు చేశారని.. కాంగ్రెస్ గెలిచాక జై పాకిస్తాన్ నినాదాలు వినిపిస్తున్నాయని.. అందుకు ఇప్పుడు అక్కడి ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. 15 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని.. హిందూ వ్యతిరేక గ్రూపులను అదుపులో ఉంచుతామని హెచ్చరించారు. ముస్లింలకు 4 శాతం మతపరమైన రిజర్వేషన్లు కల్పించడాన్ని, భజరంగ్‌దళ్ నిషేధిస్తామని చెప్పడాన్ని తాము వ్యతిరేకం అన్నారు. అవే విధానాలను తెలంగాణలో అమలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Also Read: భారత్‌లో యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేస్తాం : అసోం సీఎం హిమంత బిశ్వశర్మ

తెలంగాణలో ఐదు నెలల్లో ఎన్నికలు రానున్నాయని..బీఆర్‌ఎస్ రాక్షస పాలనను అంతమొందించి రామరాజ్యాన్ని స్థాపించేందుకు అవిశ్రాంతంగా కృషి చేద్దామని శ్రేణులకు బండి సంజయ్ పిలపునిచ్చారు. తాము ఏ విషయాన్ని కూడా తెలికగా తీసుకోమని చెప్పారు. దమ్ముంటే రాష్ట్రంలో భజరంగ్‌దళ్‌పై నిషేధం ప్రకటించాలని తాను పార్టీలకు సవాలు చేస్తున్నట్టుగా చెప్పారు. ఇక్కడ హిందూ సమాజం అవగాహనతో ఉన్నందున వారి పన్నాగాలు ఫలించవని అన్నారు.