భారత్‌లో యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేస్తామన్నారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ. బీఆర్ఎస్‌కు వీఆర్ఎస్ ఇచ్చే సమయం దగ్గరపడిందని సీఎం అన్నారు.
తెలంగాణలో రజాకార్ల రాజ్యం నడుస్తోందన్నారు బీజేపీ నేత, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ. ఆదివారం కరీంనగర్‌లో జరిగిన హిందూ ఏక్తా యాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో రామరాజ్యం ఏర్పాటే తమ లక్ష్యమని.. ఓవైసీ బెదిరింపులకు తాము భయపడేది లేదన్నారు. ఓవైసీ ఇంట్లోకి కూడా వెళ్తామని.. ఏం చేస్తాడో చూస్తామన్నారు. బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటేనని.. అసోంలో దాదాపు 6 వేల మదర్సాలను మూసివేయించామని, వచ్చే ఏడాది మరో 1000 మదర్సాలను క్లోజో చేస్తామని బిశ్వశర్మ తెలిపారు.
అసోంలో లీటర్ డీజిల్ ధర 92 రూపాయలే వుందని.. మరి ధనిక రాష్ట్రమైన తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు అధికంగా వున్నాయని బిశ్వశర్మ ప్రశ్నించారు. ఇక్కడ ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో వేయడం లేదని ఆయన మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ప్రతి నెలా ఒకటో తారీఖునే వేతనాలు జమ చేస్తామని బిశ్వశర్మ హామీ ఇచ్చారు. భారత్‌లో యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేశామని.. ప్రధాని మోడీ పేదల అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారని హిమంత బిశ్వశర్మ తెలిపారు. బీఆర్ఎస్‌కు వీఆర్ఎస్ ఇచ్చే సమయం దగ్గరపడిందని సీఎం అన్నారు.
ALso Read: కర్నాటక హిందువులపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ.. హిందూ సంఘటితం కోసమే హిందూ ఏక్తా యాత్ర నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ యాత్ర ఎవ్వరికీ వ్యతిరేకం కాదని.. కర్ణాటకలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు వినిపిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో 4 శాతం ముస్లిం రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు. హిందువులపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని ఆయన పిలుపునిచ్చారు.
