Asianet News TeluguAsianet News Telugu

అమిత్ షా ఆఫీసు నుంచి బండి సంజయ్‌కు ఫోన్.. రేపు అందుబాటులో ఉండాలని ఆదేశం..

తెలంగాణ బీజేపీ (telangana bjp) అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) రెండు రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)  అపాయింట్‌మెంట్ కోరారు. ఈ క్రమంలోనే తాజాగా అమిత్ షా ఆఫీసు నుంచి బండి సంజయ్‌కు ఫోన్ కాల్ వచ్చింది. 
 

Bandi Sanjay and telangana bjp mps mlas likely to meet Amit Shah Tomorrow
Author
Hyderabad, First Published Dec 8, 2021, 10:34 AM IST

తెలంగాణ బీజేపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక బీజేపీ విజయం సాధించిన తర్వాత తెలంగాణ బీజేపీ మరింత ఉత్సహంతో ముందుకు సాగుతుంది. పార్టీలో చేరికలపై దృష్టి సారించింది. అంతేకాకుండా.. ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు గట్టిగానే సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay) ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలనకు వెళ్లిన సమయంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితులను బీజేపీ అధిష్టానం ఆరా తీసినట్టుగా ఆ పార్టీ శ్రేణులు చెప్పాయి. మరోవైపు ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రంలోని బీజేపీపై టీఆర్‌ఎస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. 

ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) రెండు రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)  అపాయింట్‌మెంట్ కోరారు. ఈ క్రమంలోనే తాజాగా అమిత్ షా ఆఫీసు నుంచి బండి సంజయ్‌కు ఫోన్ కాల్ వచ్చింది. రేపు అందుబాటులో ఉండాలని అమిత్ షా కార్యాలయం బండి సంజయ్‌ ఆదేశాలు అందాయి. ఈ ఆదేశాల మేరకు తెలంగాణలోని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో సహా నలుగురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు, బండి సంజయ్.. గురువారం అమిత్ షాతో భేటీ కానున్నారు. 

ఈ బేటీలో తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్‌ చుగ్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు, ధాన్యం కొనుగోలుపై టీఆర్‌ఎస్ వైఖరి ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా పలు అంశాలపై అమిత్ షా.. వారికి దిశా నిర్దేశం చేయనున్నారు. ఇక, ప్రస్తుతం బండి సంజయ్‌తో పాటుగా, తెలంగాణ బీజేపీ ఎంపీలు కూడా ఢిల్లీలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇటీవల తెలంగాణ‌ ఉద్యమ నాయకులతో పాటుగా, పలువురు బలమైన నాయకులను కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. పార్టీలో చేరుతున్న వారిని ఢిల్లీ తీసుకెళ్లి కాషాయ కండువా కప్పిస్తున్నారు. ఇటీవల తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగ సంఘాల నేత, టీఎస్‌పీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్, ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios