తెలంగాణ ఆర్టీసీ సమ్మె సమయంలో గుండెపోటుతో మరణించిన కార్మికుడి అంతిమయాత్ర నిర్వహిస్తున్న తరుణంలో పోలీసులు ఆ యాత్రను అడ్డుకున్న విష్యం తెలిసిందే. ఆ యాత్రలో ఉన్న బీజేపీ ఎంపీ బండి సంజయ్ అప్పట్లో పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేసారు. పథకం ప్రకారమే తనపై దాడి చేసారని బండి సంజయ్ ఆరోపించారు. ఆ తరువాత ఆ విషయాన్ని లోక్ సభ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన స్పీకర్ ఈ విషయాన్ని హక్కుల కమిటీకి పంపారు. 

తొలిసారి కమిటీ విచారణ శుక్రవారం నాడు ప్రారంభమయింది. ఆ అంతిమయాత్ర నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు తనపై పథకం ప్రకారం దాడి చేసారని, పరుష పదజాలంతో తనను దూషించారని ఆయన ఆరోపించారు. 

ఈ విషయంపై స్పందించిన హక్కుల కమిటీ నలుగురు పోలీస్ అధికారులకు నోటీసులను జారీ చేసింది. అప్పటి ఇన్‌చార్జి పోలీసు కమిషనర్‌ సత్యనారాయణ, అదనపు డిప్యూటీ కమిషనర్‌ (ఏఆర్‌) సంజీవ్‌, ఏసీపీ (ఏఆర్‌) నాగయ్య , ఇన్‌స్పెక్టర్‌ అంజయ్య, మరికొంతమంది ఇతర పోలీసులు తనపై దాడి చేసారని బండి సంజయ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఇకపోతే... తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దూకుడును పెంచింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకొని బీజేపీ నాయకత్వం విమర్శల దాడిని తీవ్రం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలపై కూడ బీజేపీ నేతలు పదునైన విమర్శలు గుప్పిస్తున్నారు.

2023లో తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గత ఎన్నికల సమయంలోనే బీజేపీ ఈ మేరకు ప్రయత్నాలు ప్రారంభించినా ఆశించిన మేరకు ఫలితాలు రాలేదు. కానీ, కాంగ్రెస్ పార్టీతో పాటు టీడీపీకి చెందిన కొందరు నేతలు తెలంగాణలో బీజేపీ తీర్ధం పుచ్చుకొన్నారు.

గత ఏడాదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడం కూడ ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపింది.టీఆర్ఎస్ కు ఆయువుపట్టు లాంటి కరీంనగర్ ఎంపీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకొంది. కేసీఆర్ కూతురు పోటీ చేసిన నిజామాబాద్ స్థానంలో ధర్మపురి అరవింద్ విజయం సాధించారు.

బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒంటికాలిపై లేస్తున్నారు. కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ ఇవాళ వైద్య ఆరోగ్య కార్యాలయాలతో పాటు ఆసుపత్రుల ముందు బీజేపీ నిరసనలకు దిగింది.