కరోనా: హైదరాబాదులోని పెద్దమ్మ, ఎల్లమ్మ తల్లుల ఆలయాల మూసివేత
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో హైదరాబాదులోని ఎల్లమ్మ, పెద్దమ్మ తల్లుల ఆలయాలను మూసివేశారు. ఈ నెల 14వ తేదీ వరకు ఆలయాలను భక్తుల కోసం మూసివేస్తున్నట్లు ప్రకటంచారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజదాని హైదరాబాద్‌లో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి, బల్కంపేట ఎల్లమ్మ ఆలయాలను మూసివేయాలని ఆయా ఆలయాల అధికారులు నిర్ణయించారు.
ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నేటి నుంచి సాధారణ, ప్రత్యేక దర్శనాలతోపాటు అన్ని సేవలను నిలిపివేస్తున్నట్టు పెద్దమ్మతల్లి ఆలయ అధికారులు తెలిపారు. అయితే, అంతరాలయంలో నిత్య పూజలు మాత్రం జరుగుతాయని స్పష్టం చేశారు.
బల్కంపేటలోని ఎల్లమ్మ ఆలయ అధికారులు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. నేటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి అన్నపూర్ణ తెలిపారు.
భక్తులు, అర్చక సిబ్బంది క్షేమాన్ని కాంక్షిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఆలయం పక్కనే ఉన్న బోనం కాంప్లెక్స్‌ను కూడా మూసివేస్తున్నట్టు తెలిపారు. అమ్మవారి ఏకాంత సేవలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేశారు