వందల కోట్లు తీసుకుని వివేక్, వినోద్‌లకు కాంగ్రెస్ టికెట్లు..: రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఫైర్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడని ప్రశ్నించారు. తన వద్ద వందల కోట్లు ఉన్నాయనే విషయాన్ని రేవంత్ నిరూపించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి స్వార్దం కోసం ఉస్మానియా విద్యార్థులను వాడుకున్నారని.. ఎన్నికల్లో ఒక్కరికి కూడా టికెట్లు ఇవ్వలేదని విమర్శించారు. వివేక్, వినోద్‌ల నుంచి వందల కోట్లు తీసుకుని రేవంత్ వారికి కాంగ్రెస్ టికెట్లు ఇప్పించాడని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్లను అమ్ముకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. వివేక్, వినోద్ వంటి వారు గెలిస్తే ఫ్యూడలిస్ట్ పాలన వస్తుందని అన్నారు. వివేక్ తండ్రి వెంకటస్వామి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టించారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంట్ చాలని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మూడు గంటలు కరెంట్ కావాలా?, 24 గంటల కరెంట్ కావాలా అనేది ప్రజలు ఆలోచన చేయాలని కోరారు.
పెట్టుబడిదారు, రౌడీ రాజకీయం కావాలా? ప్రశాంతమైన రాజకీయం కొనసాగాలా? అనేది ప్రజలు ఆలోచించాలని అన్నారు. బెల్లంపల్లి, చెన్నూరులలో దుర్గం చిన్నయ్య, తాను గెలవకుంటే.. వెనకటి రోజులు వస్తాయని, పెట్టుబడి దారులు వస్తాయని అన్నారు. మంచిర్యాల జిల్లాలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలంటే.. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తమకే సర్వే రిపోర్ట్స్ సానుకూలంగా ఉన్నాయని చెప్పారు. మంచిర్యాల జిల్లాలో మూడు సీట్లలో బీఆర్ఎస్ పార్టీనే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
గడ్డం వివేక్, వినోద్ చేస్తున్న కార్పొరేట్ రాజకీయాలను ప్రజలు గమనించాలని కోరారు. చెన్నూరు, బెల్లంపల్లి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వాళ్ల మాదిరిగా కోట్లు తెచ్చి గుమ్మరించడం తమకు ఎక్కడి నుంచి వస్తాయని అన్నారు. తమకు వ్యాపారాలు లేవని, పెట్టుబడిదారు కుటుంబాల నుంచి వచ్చినోళ్లం కాదని చెప్పారు. సూట్‌కేసు రాజకీయాలు చేసే వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. కోట్లకు కోట్లు డబ్బులు తెచ్చి నాయకులను అడ్డగోలుగా కొంటున్నారని ఆరోపించారు. అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని.. తాము ఫిర్యాదు చేస్తే బద్నాం చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.