Asianet News TeluguAsianet News Telugu

బాబు నక్కజిత్తుల డ్రామా, కాంగ్రెసులో ఆయన ఏజెంట్లు : సుమన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్ తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు నక్క జిత్తుల కుట్రలు మళ్లీ మొదలు పెట్టారని ఆరోపించారు.

Balka Suman says chandrababu started new drama
Author
Hyderabad, First Published Sep 15, 2018, 3:45 PM IST

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్ తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు నక్క జిత్తుల కుట్రలు మళ్లీ మొదలు పెట్టారని ఆరోపించారు. వందల కోట్ల రూపాయలు తెలంగాణకు తరలించారని, తెలంగాణను కలుషితం చేసేందుకు చంద్రబాబు ఏపీ ఇంటెలిజెన్స్‌ను వాడుకుంటున్నారని ఆయన అన్నారు. 

వేరే రాష్ట్రాల ఇంటెలిజెన్స్‌ పోలీసులు తెలంగాణలో ఎందుకు తిరుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. డీజీపీ, గవర్నర్‌ ఆ విషయంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై ఈసీకి కూడా ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. 

లేదంటే తామే ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతామని తెలిపారు. చంద్రబాబు చీకటి రాజకీయాలు మానుకోవాలని బాల్క సుమన్‌  సూచించారు. చంద్రబాబు చీకటి రాజకీయాలు.. వెన్నుపోటు రాజకీయాలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాజకీయాలను కలుషితం చేయాలని చంద్రబాబు చేస్తున్న కుట్రలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. 

ఆంధ్రా పోలీసులు తెలంగాణలో అడ్డా పెట్టడం అనైతిక చర్య అని అన్నారు. చంద్రబాబు ఏజెంట్లు కాంగ్రెస్‌లో ఉన్నారని ఆయన అన్నారు. చంద్రబాబు చర్యలకు తమ ప్రతిచర్య తీవ్రంగా ఉంటుందని అన్నారు.

ఏబీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో 100 మందికి పైగా పోలీసులు ఇక్కడ మోహరించారని, ఏపీ నుంచి వందల కోట్లను ఇక్కడికి దిగుమతి చేసి గోల్‌మాల్ చేయాలని చూస్తున్నారని అన్నారు. నాలుగు ఓట్లు రాలుతాయనే ఆశతో కుట్రల కాంగ్రెస్‌తో టీడీపీ జతకట్టిందని అన్నారు. ఏపీ పోలీసులు పచ్చ పార్టీ ఏజెంట్లుగా మారారని, ఏదైనా జరగరాని సంఘటన జరిగితే దానికి బాధ్యత చంద్రబాబుదేనని అన్నారు. తెలంగాణను విఫల రాష్ట్రంగా చిత్రీకరించడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని బాల్క సుమన్ అన్నారు.

ఎన్టీఆర్ ఆశయాలకు విరుద్ధంగా..

ఎన్టీఆర్ ఆశయాలకు విరుద్ధంగా చంద్రబాబు కాంగ్రెస్‌తో జత కడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  అన్నారు. టీడీపీ - కాంగ్రెస్ పొత్తు ఆరు నెలల క్రితమే కుదిరిందని ఆయన మీడియాతో అన్నారు. 

పొత్తు పర్యవసానాలను చంద్రబాబు రాబోయే రోజుల్లో అనుభవిస్తారని అన్నారు. పొత్తుల మూలంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు భారీ మూల్యం చెల్లించుకుంటారని అన్నారు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో డ్రామాలు నడుస్తున్నాయని, చంద్రబాబు చిన్న విషయాన్ని చిలవలు, పలవలు చేస్తున్నారని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios