హైదరాబాద్: పవర్‌లో ఉన్నా... ప్రతిపక్షంలో  ఉన్నా తెలుగు జాతి కోసం టీడీపీ పనిచేసిందని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పారు.. సమయం లేదు మిత్రమా.. రణమా.. శరణమా.. తేల్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

రైతు రాజ్యం  తెస్తామని తెలంగాణలో  కేసీఆర్ రాబందుల రాజ్యం  తీసుకొచ్చారన్నారు. మంగళవారం నాడు కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయిన్‌పల్లిలో నిర్వహించిన రోడ్‌ షో లో   సినీ నటుడు బాలకృష్ణ మాట్లాడారు.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఏ ఒక్క హమీని అమలు చేయలేదన్నారు.ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత  ముస్లింలకు ప్రత్యేకంగా మైనార్టీ కార్పోరేషన్ ‌ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను ఇస్తామని  కేసీఆర్  అబద్దపు వాగ్దానాలను ఇచ్చారని చెప్పారు. రైతుల రాజ్యం వస్తోందని భావిస్తే తెలంగాణలో రాబందుల రాజ్యం వచ్చిందని బాలకృష్ణ ఆరోపించారు. 

అప్పుల్లో పుట్టి అప్పుల్లో పెరిగి అప్పుల్లోనే రైతులు మరణిస్తున్నారని బాలయ్య విమర్శించారు. కౌలు రైతులకు రైతు బంధు వల్ల ప్రయోజనం కలగదన్నారు.  భూస్వాములు, జాగీర్ధార్లకు వ్యతిరేకంగా టీడీపీ ఆవిర్భవించిందన్నారు. గరీబోళ్ల రాజ్యాన్ని టీడీపీ తీసుకొచ్చిందన్నారు. టీఆర్ఎస్ మరోసారి  దొరల రాజ్యాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అవినీతిలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని బాలకృష్ణ గుర్తు చేశారు.

టీడీపీ అధికారంలో ఉన్న కాలంలో  విద్యను విద్యార్థులకు అందుబాటులోకి తిసుకొచ్చిన విషయాన్ని బాలయ్య ప్రస్తావించారు.  భాంచన్  నీ కాల్మోక్త  అనే  బానిస బతుకులను కేసీఆర్ సర్కార్ తెచ్చే ప్రయత్నం చేస్తోందని  ఆయన ఆరోపించారు.

అణగారిన వర్గాలకు అండగా టీడీపీ జెండా ఉంటుందన్నారు. చంద్రబాబునాయుడు ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి  సీఎంగా ఉన్న కాలంలో అభివృద్ధి చేసినట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్‌‌‌తో  కేసీఆర్ పగ్గాలు చేపట్టారని... కేసీఆర్ ప్రస్తుతం రాష్ట్రాన్ని లక్షల కోట్లు అప్పులు చేశారని బాలయ్య విమర్శించారు.

హైద్రాబాద్, సైబరాబాద్‌లలో  చంద్రబాబునాయుడు అభివృద్ధి చేశారన్నారు.  తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకువస్తారని బాలయ్య అభిప్రాయపడ్డారు. చంద్రబాబునాయుడు నిర్మించిన భవనాల్లోనే సమావేశాలు నిర్వహిస్తూ ఆయననే విమర్శిస్తున్నారని  బాలయ్య ఎద్దేవా చేశారు.

టీడీపీ ఒక కులం కోసం, ఒక మతం కోసం పుట్టిన పార్టీ కాదన్నారు.  నాయకుల కోసం పుట్టిన పార్టీ కాదని చెప్పారు.  హైద్రాబాద్ నగరంలో  పుట్టిన పార్టీ టీడీపీ అని ఆయన గుర్తు చేశారు.

పవర్‌లో ఉన్నా... ప్రతిపక్షంలో  ఉన్నా తెలుగు జాతి కోసం టీడీపీ పనిచేసిందన్నారు. సమయం లేదు మిత్రమా.. రణమా.. శరణమా.. తేల్చుకోవాలని  బాలయ్య టీడీపీ కార్యకర్తలకు  పిలుపునిచ్చారు.