Asianet News TeluguAsianet News Telugu

ఎంపీలు, ఎమ్మెల్యేలను ముంచేస్తాడు.. బాధితుల్లో వీహెచ్, దేవేందర్‌గౌడ్, పాల్వాయి

తెలుగు రాష్ట్రాల్లోని ప్రజాప్రతినిధులను టార్గెట్ చేసి వారి నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఘరానా మోసగాడు తోట బాలాజీ నాయుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 

balaji naidu arrested cheating political leaders in telugu states
Author
Hyderabad, First Published Oct 22, 2018, 2:10 PM IST

తెలుగు రాష్ట్రాల్లోని ప్రజాప్రతినిధులను టార్గెట్ చేసి వారి నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఘరానా మోసగాడు తోట బాలాజీ నాయుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. తెలుగు రాష్ట్రాల్లోని 29 పోలీసు స్టేషన్లలో 32 కేసులు నమోదై.. 21 సార్లు జైలుకువెళ్లిన ఇతను పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించాడు.

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన తోట బాలాజీ నాయుడు కాకినాడ జేఎన్‌టీయూలో బీటెక్ పూర్తి చేశాడు.. 2003లో ఎన్టీపీసీలో జూనియర్ ఇంజనీర్‌గా చేరి ఉమ్మడి రాష్ట్రంలోని రామగుండం, పాల్వంచ, విశాఖపట్నం ప్రాంతాల్లో పనిచేశాడు.. విశాఖలో ఉద్యోగం చేస్తూ.. 2008లో నాటి తణుకు ఎమ్మెల్యే పీఏ‌ ఆనంద్ నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

శాఖాపరమైన విచారణతో పాటు ఏసీబీ విచారణలోనూ నేరం రుజువుకావడంతో ప్రభుత్వం ఇతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది. అయితే శిక్షాకాలంలో జైలులో ఉండగా.. పాత నేరస్థులతో సాన్నిహిత్యం పెంచుకుని మోసాలతో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. సమైక్య రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజాప్రతినిధుల పీఏలకు ఫోన్లు చేసి ఎన్‌టీపీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని.. మీ మీ నియోజకవర్గాల యువతకు చెప్పాలని ఎరవేసేవాడు..

అలా ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి డబ్బు వసూలు చేశాడు. దీనిపై అందిన ఫిర్యాదులతో 2009లో విజయనగరం పోలీసులు బాలాజీని అరెస్ట్ చేసి మరోసారి జైలుకు పంపారు. నల్గొండ జిల్లాలోనూ ఒక ప్రజాప్రతినిధిని ఇలాగే మోసం చేయడంతో 2010లో యాదగిరి గుట్ట పోలీసులు జైలుకు తరలించారు.

నర్సాపురం పోలీస్ స్టేషన్‌ పరిధిలో రాజీవ్ ఆరోగ్య శ్రీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నేతల నుంచి రూ.1.5 లక్షలు వసూలు చేసి కటకటాల్లోకి వెళ్లాడు. ఈ క్రమంలో సత్యనారాయణ అనే వ్యక్తి పరిచయం కావడంతో.. ఒక ముఠాను ఏర్పాటు చేసుకుని మరికొన్ని నేరాలు చేశాడు..

బీఎస్ఎన్ఎల్ సంస్థకు చెందిన ఎంక్వైరీ నెం. 197ని సంప్రదించి రాజీవ్ యువకిరణాల ప్రాజెక్ట్ డైరెక్టర్‌నని.. అవనిగడ్డ, విజయనగరం, చిలకలూరిపేట, బొబ్బిలి, నర్సాపురం, బెంగళూరు, అంబర్‌పేట, యాదగిరిగుట్ట, సాలూరు, చీపురుపల్లి, పొన్నూరు, కారంచేడులకు చెందిన ప్రజా ప్రతినిధుల ఫోన్‌ నెంబర్లు తెలుసుకుని 2013లో ఒక్కో అభ్యర్థికి రూ.1,060 వంతున డిపాజిట్ చేయించుకుని రూ.3.50 లక్షలు వసూలు చేశాడు.

వీటిపై బీజేపీ నేత రాంజగదీష్ ఫిర్యాదు మేరకు 2013 ఫిబ్రవరిలో కాచిగూడ పోలీసులు బాలాజీని అదుపులోకి తీసుకున్నారు. బెయిల్‌పై బయటకు వచ్చిన నాయుడు మరింత రెచ్చిపోయాడు.. ఈసారి ఏకంగా నాటి ఎంపీలు, ప్రముఖ నేతలు వీహెచ్, దేవేందర్ గౌడ్, పాల్వాయి గోవర్థన్‌లను టార్గెట్ చేశాడు.. వీహెచ్‌ రూ.1,09,500, దేవేందర్‌గౌడ్‌ నుంచి రూ.66,000, గోవర్థన్‌ రూ.1,32,00 డిపాజిట్‌ చేశారు.

తర్వాత దీనిపై వారికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ అయ్యాడు. వరుసగా మోసాలకు పాల్పడుతుండటంతో హైదరాబాద్ పోలీసులు గతేడాది జనవరిలో బాలాజీ నాయుడిని పీడీ చట్టం కింద ఏడాది పాటు జైలుకు పంపారు. మళ్లీ ఈ ఏడాది జనవరిలో విడుదలైన బాలాజీ మళ్లీ యథాప్రకారంగా మోసాలు చేస్తూ వచ్చాడు..

ఎమ్మెల్సీ ఆకుల లలితకు ఫోన్ చేసి తాను కేంద్రప్రభుత్వ ఉద్యోగినని.. కేంద్ర పథకాలకు సంబంధించిన రూ.2 కోట్లు నిధులు పెండింగ్‌లో ఉన్నాయని.. 5% తనకు చెల్లిస్తే నిధులు విడుదల చేయిస్తానని చెప్పాడు. నిజమేనని నమ్మిన లలిత తన కుమారుడి ద్వారా బాలాజీ చెప్పిన బ్యాంకు ఖాతాలో రూ.10 లక్షలు డిపాజిట్ చేశారు.

తాజాగా సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్ భర్తకు ఫోన్ చేసి కేంద్రప్రభుత్వ పథకంలోని మున్సిపాలిటీ నిధుల్లో భాగంగా సూర్యాపేటకు రూ.2 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని.. రూ.30 వేలు చెల్లిస్తే ఫైల్ క్లియర్ చేయిస్తానని చెప్పాడు. దీనిపై ఛైర్‌పర్సన్ భర్త టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలాజీ నాయుడి కదలికలపై నిఘా పెట్టిన హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం వలపన్ని అతన్ని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios