సర్కారు తీరుపై వినూత్న పోరు సాగిస్తున్న నిరుద్యోగులుతాజాగా బాహుబలి జోక్ వదిలిన టీచర్ అభ్యర్థులు

తెలంగాణ టీచర్ అభ్యర్థులు తమ నిరసనను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. మూడేళ్ల కాలంగా తెలంగాణ సర్కారు టీచర్ పోస్టుల భర్తీ చేపట్టకపోవడంతో ఆందోళనలో ఉన్నారు అభ్యర్థులు. దీంతో తమ ఆవేదనను, తమ బాధలను సోషల్ మీడియాలో జోక్స్ రూపంలో వెల్లబోసుకుంటున్నారు. ఇప్పటికే అనేక జోక్స్ వేసి సర్కారు వైఖరిని ఎండగట్టారు నిరుద్యోగులు. తాజాగా ఇంకో జోక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తెలుగు తెర మీద రికార్డుల మోత మోగించిన బాహుబలి చిత్రంలోని ఒక డైలాగ్ ను తెలంగాణ డిఎస్సీకి అన్వయిస్తూ నిరుద్యోగ యువత ఈ జోక్ రూపొందించింది. బాహుబలి సినిమాలో కట్టప్పతో అమరేంద్ర బాహుబలి చెప్పిన పాపులర్ డైలాగ్ ను ఇక్కడ వాడారు. నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్నన్ని రోజులు డిఎస్సీ వేయలేవ్ తాత అంటూ ఆ జోక్ రూపొందించారు.

మొత్తానికి తెలంగాణ సర్కారు టీచర్ పోస్టుల భర్తీ విషయంలో నాన్చివేత ధోరణి అవలంభిస్తున్న తీరుపై లక్షలాది మంది నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు డిఎస్సీ వేస్తారా అని కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఈ వైరల్ జోక్స్ వచ్చిన సందర్భంలో అయినా సర్కారు స్పందించాలని వారు కోరుకుంటున్నారు.