ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ ‌సిక్కిరెడ్డి నివాసంలో నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్టుగా వార్తలు రావడం మరింత కలకలంగా మారాయి. అయితే ఈ పరిణామాలపై సిక్కిరెడ్డి భర్త, బ్యాడ్మింటన్ ప్లేయర్ సుమిత్ స్పందించారు.  

నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ ‌సిక్కిరెడ్డి నివాసంలో పార్టీలు జరిగినట్టుగా వార్తలు రావడం మరింత కలకలంగా మారాయి. ఈ క్రమంలోనే స్పందించిన సిక్కిరెడ్డి తల్లి మాధవి.. ఆ వార్తలను తోసిపుచ్చారు. కేపీ చౌదరి తమకు తెలిసి వ్యక్తి మాత్రమేనని చెప్పారు. అతను ఎలాంటి వాడో తమకు తెలియదని స్పష్టం చేశారు. అయితే తాజాగా ఈ వ్యవహారంపై సిక్కిరెడ్డి భర్త, బ్యాడ్మింటన్ ప్లేయర్ సుమిత్ స్పందించారు. స్నేహిత హిల్స్‌లోని ప్లాట్‌ను తమ పెళ్లి ముందు సిక్కిరెడ్డి తల్లిదండ్రులు గిఫ్ట్‌గా ఇచ్చారని చెప్పారు. 

కేపీ చౌదరితో సిక్కిరెడ్డి కుటుంబానికి గతంలో పరిచయం ఉందని.. అయితే కొన్నేళ్లుగా ఎక్కడున్నారో తెలియదని అన్నారు. అయితే ఇటీవల హైదరాబాద్‌లో షెల్టర్‌ కోరితే నాలుగు రోజుల కోసం ఇవ్వడం జరిగిందని చెప్పారు. సిక్కికి, కేపీ చౌదరి మధ్య డ్రగ్స్‌కు సంబంధించి ఎలాంటి సంభాషణ జరిగిన పోలీసులు ప్రస్తావించేవారని అన్నారు. తమ ఇంట్లో ఉన్నాడని తమను బద్నాం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. అతడు అలా చేస్తాడని తెలిస్తే తాము ఇళ్లు ఇచ్చేవాళ్లమే కాదని అన్నారు. 

Also Read: కేపీ చౌదరి తెలిసిన వ్యక్తి,‌ ఇళ్లు షెల్టర్‌కు ఇచ్చాం.. ఆ వార్తలు అవాస్తవం: సిక్కిరెడ్డి తల్లి

డ్రగ్స్ అనేది చాలా పెద్ద విషయమని అన్నారు. ప్లేయర్స్‌గా తాము చాలా జాగ్రత్తగా ఉంటామని చెప్పారు. ప్రతి మ్యాచ్‌కు ముందు డోప్ టెస్ట్ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. డోప్ టెస్ట్ ఉంటుంది కనుక.. ప్రతి చిన్న ట్యాబ్లెట్ కూడా చూసి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. పార్టీకి వెళ్లినా ఎలాంటి డ్రింక్స్ తీసుకోమని అన్నారు. సిక్కిరెడ్డి పేరుతో ప్లాట్‌ ఉన్నంతా మాత్రాన డ్రగ్స్ కేసుతో లింక్ ఉందంటే ఎలా అని ప్రశ్నించారు. ఆ ప్లాట్‌లో ఏం జరిగిందో తమకు తెలియదని అన్నారు. తాము ఒకవేళ విచారణను ఎదుర్కొవాల్సి వస్తే.. ఎలాంటి విచారణకైనా సిద్దమని చెప్పారు.