తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఓటర్ లిస్టులో తన పేరు గల్లంతవడం పట్ల ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇలా కారణం లేకుండానే ఓట్లు గల్లంతవుతుంటే ఎన్నికలు పారదర్శకంగా జరుగుతున్నాయని ఎలా అనుకుంటామని గుత్తా జ్వాల ప్రశ్నించారు. 

ఆన్ లైన్‌ ఓటర్ లిస్ట్ లో తన పేరు చెక్ చేసుకోగా కనిపించలేదని దీంతో తాను ఆశ్చర్యానికి గురయ్యానని జ్వాల తెలిపారు. తమ ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పిన తానే ఓటు హక్కు వినియోగించుకోలేకపోయానని అన్నారు. 

ఓటర్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆమె నిరాశ చెందినట్లు తెలిపారు. కేవలం గుత్తాజ్వాల ది మాత్రమే కాకుండా.. చాలా మంది ఓటర్ల ఓట్లు గల్లంతయ్యాయి. ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చి..తమ పేరు కనిపించకపోవడంతో చాలా మంది వెనక్కి తిరిగి వెళ్లిపోతున్నారు. 

శుక్రవారం ఉదయం ఏడుగంటలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ మొదలైన సంగతి తెలిసిందే. 119 నియోజకవర్గాల్లోని 32,185 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది ఓటింగ్‌ను ప్రారంభించారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుండగా.. మిగిలిన ప్రాంతాల్లో షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.