హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన మాజీ పార్లమెంటు సభ్యుడు మొహమ్మద్ అజరుద్దీన్ కారెక్కడం ఖాయమనే మాట వినిపిస్తోంది. తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో ఆయన భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాత మాట్లాడిన ఆయన తాను టీఆర్ఎస్ చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై మాత్రం మాట్లాడలేదు.

పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించకపోవడంతో అజరుద్దీన్ టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధపడినట్లు ప్రచారం సాగుతోంది. మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించలేదు. యువత నైపుణ్యాన్ని గుర్తించి క్రికెట్ లోకి తీసుకుని వస్తామని అజరుద్దీన్ చెప్పారు. 

హెచ్ సిఎ ప్యానల్ సభ్యులతో కలిసి ఆయన కేటీఆర్ ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. క్రికెట్ కు ప్రభుత్వ సహకారం అందించాలని కేటీఆర్ ను కోరినట్లు ఆయన తెలిపారు. క్రీడలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ఆయన కితాబు ఇచ్చారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా కలిసి క్రికెట్ కు సహకారం కోరుతామని ఆయన చెప్పారు. 

కేటీఆర్ సహకారంతోనే అజరుద్దీన్ హెచ్ సిఎలో పాగా వేశారనే మాట వినిపిస్తోంది. ఆయన టీఆర్ఎస్ లో చేరుతారని గత కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.