ఇంటికి వెళ్లడానికి ఆటో ఎక్కిన మహిళపై ఆటో డ్రైవర్ కన్నేశాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడాలని అనుకున్నాడు. కానీ.. సదరు మహిళ అతనికి లొంగకపోవడంతో.. దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలోని జల్ పల్లి పెద్ద చెరువు వద్ద ఈ నెల 7వ తేదీన ఓ మహిళ మృతదేహాం పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా.. పోలీసులు రంగంలోకి దిగి.. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.

అనుమానాస్పదంగా వెళ్లిన ఓ ఆటో నెంబర్ ఆధారంగా కంచన్ బాగ్ కు చెందిన మొహ్మద్ ఫిరోజ్(23)ను నిందితుడిగా తేల్చారు. మహిళ ఎవరు అనే విషయం తెలియకపోవడంతో.. నిందితుడు చెప్పిన ఆధారాల ప్రకారం ఊహా చిత్రాన్ని గీయించారు. ఆ చిత్రం ఆధారంగా చనిపోయిన మహిళ చాంద్రాయణగుట్టకు  చెందిన నసీం ఫాతిమా(30)గా గుర్తించారు. ఆమె భర్త మరణించడంతో, ఇళ్లలో పనులు చేస్తూ పిల్లల్ని పోషిస్తోంది.

ఈ నెల 6న బాబానగర్ లో ఉండే తన సోదరి ఇంటికి వెళ్లింది. తిరిగి వచ్చేటప్పుడు ఆలస్యం కావడంతో ఆటో ఎక్కింది. కాగా.. ఆమెపై కన్నేసిన  డ్రైవర్ అత్యాచారానికి పాల్పడాలని అనుకున్నాడు. ఆమె తిరగపడటంతో.. తలపై బండరాయితో మోది హత్య చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.