హైదరాబాద్ నగరంలో కలకలం రేగింది. నడి రోడ్డుపై ఓ ఆటో డ్రైవర్ ని మరో ఆటో డ్రైవర్ దారుణంగా హత్య చేశాడు. బుధవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో పంజాగుట్ట కూడలిలో ఈ సంఘటన  చోటుచేసుకుంది. కాగా... ఈ ఘటన ప్రత్యక్షంగా చూసిన స్థానికులు, వాహనదారులు భయంతో పరుగులు తీశారు.

కత్తిపోట్లకు గురైన బాధితుడు రక్తంకారుతున్నా.. తనను తాను రక్షించుకునేందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడే కుప్పకూలాడు. పోలీసులు అతనిని పరిశీలించగా...  చనిపోయినట్లు గుర్తించారు. కాగా.. వివాహేతర సంబంధమే  ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే...పంజాగుట్ట సమీపంలో నివసించే అన్వర్‌ (32), ప్రతాప్‌నగర్‌కు చెందిన రియాసత్‌ అలీ (35) గతంలో స్నేహితులు. ఓ మహిళతో వివాహేతర సంబంధంపై అనుమానం వారిద్దరి మధ్య కక్షలకు దారితీసింది. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం పంజాగుట్ట ఆటో స్టాండ్‌ వద్ద ఘర్షణపడ్డారు. రియాసత్‌ తన వెంట తెచ్చుకున్న కత్తితో అన్వర్‌ను పొట్టలో పొడిచాడు.

ప్రాణాలు రక్షించుకునేందుకు పోలీస్ స్టేషన్ లో పరిగెత్తి బాధితుడు అక్కడే కన్నుమూశాడు. అతడి వెనకాలే పోలీసుస్టేషన్‌కు వచ్చిన నిందితుడు రియాసత్‌ ఎస్సై శ్రీకాంత్‌ గౌడ్‌ వద్ద లొంగిపోయాడు.

అయితే..‘తన భార్యకు ఎయిడ్స్‌ రక్తం ఎక్కించడానికి అన్వర్‌ ప్రయత్నిస్తున్నాడని.. అందుకే చంపేశా’నంటూ నిందితుడు రియాసత్‌ చెప్పాడని.. అయితే ఇందులో నిజానిజాలను తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నామని పంజాగుట్ట పోలీసులు తెలిపారు.