ఈ నెల 24న ఔరంగాబాద్ అంఖాస్ మైదానంలో తలపెట్టిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు అక్కడి పోలీసులు అనుమతి నిరాకరించారు. అంఖాస్ మైదానంలో కాకుండా మిలింద్ కాలేజ్ సమీపంలో ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు బీఆర్ఎస్ నేతలకు సూచించారు.
బీఆర్ఎస్‌ను దేశవ్యాప్తంగా విస్తరించాలని సీఎం కేసీఆర్ పావులు కదుపుతోన్న సంగతి తెలిసిందే. తెలంగాణకు వెలుపల మహారాష్ట్రపై ఫోకస్ పెట్టిన ఆయన.. వరుసగా సభలు , సమావేశాలు నిర్ణయిస్తున్నారు. అలాగే ఆ రాష్ట్రానికి చెందిన పలువురు నేతలను కూడా పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌కు ఔరంగాబాద్ పోలీసులు షాకిచ్చారు. ఈ నెల 24న అంఖాస్ మైదానంలో తలపెట్టిన సభకు అక్కడి పోలీసులు అనుమతి నిరాకరించారు.
భద్రతా కారణాల రీత్యానే సభకు అనుమతులు ఇవ్వడం లేదని పోలీసులు వెల్లడించారు. దీనికి అంఖాస్ మైదానంలో కాకుండా మిలింద్ కాలేజ్ సమీపంలో ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు బీఆర్ఎస్ నేతలకు సూచించారు. అయితే మిలింద్ కాలేజీలో సభ నిర్వహించడం పట్ల పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సుముఖంగా లేరని సమాచారం. ఇప్పటికే మహారాష్ట్రలో బీఆర్ఎస్ రెండు సభలను నిర్వహించిన సంగతి తెలిసిందే.
