తెలంగాణకు చెందిన కబడ్డీ ఆటగాళ్లను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కబడ్డీ మ్యాచ్ ఆడేందుకు కొందరు తెలంగాణ ఆటగాళ్లు పుదుచ్చేరి వెళ్లారు. మ్యాచ్ అనంతరం తిరుగు ప్రయాణంలో చెన్నైకి చేరుకున్నారు.

అక్కడ కోచ్‌తో పాటు కొందరు ఆటగాళ్లు అన్నాసలై నుంచి ఎగ్మోర్ వెళ్లేందుకు 29ఏ నెంబర్ సిటీ బస్సు ఎక్కారు. అయితే టికెట్ తీసుకుంటుండగా.. బస్సు కండక్టర్‌తో కోచ్ లక్ష్మణ్‌కు మధ్య వాగ్వాదం జరిగి.. అది ఘర్షణకు దారితీసింది.

అనంతరం ఎగ్మోర్‌లో కబడ్డీ ఆటగాళ్లు బస్సు దిగిన సమయంలో వారిపై కండక్టర్‌ దాడికి యత్నించాడు.. అతనికి మద్ధతుగా కొందరు స్థానికులు కూడా తెలంగాణ ఆటగాళ్లపై దాడి చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కోచ్‌తో పాటు ఆటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. కోచ్ అనుచిత ప్రవర్తన కారణంగానే ఈ ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కోచ్ లక్ష్మణే ముందుగా కండక్టర్‌పై దాడికి దిగినట్లుగా వారు చెబుతున్నారు.