సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పోలీసుల కాల్పుల్లో మరణించిన దామెర రాకేష్ అంతిమయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాకేష్ మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం నుంచి ర్యాలీగా నర్సంపేటకు ర్యాలీగా తీసుకెళ్లే సమయంలో.. ఆ దారిలో ఉన్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయంపై కొందరు దాడి చేశారు. 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పోలీసుల కాల్పుల్లో మరణించిన దామెర రాకేష్ అంతిమయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాకేష్ మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం నుంచి ర్యాలీగా నర్సంపేటకు ర్యాలీగా తీసుకెళ్లే సమయంలో.. ఆ దారిలో ఉన్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయంపై కొందరు దాడి చేశారు. పోచం మైదాన్‌ కూడలిలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంపై రాళ్ల దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. 

బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయానికి నిప్పు పెట్టేందుకు యత్నించగా పోలీసులు వారిని నివారించారు. అదే సమయంలో బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన ఆందోళనకారులను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఇక, రాకేష్ అంతిమాత్ర పోచం మైదాన్‌ కూడలి మీదుగా సాగుతుంది. రాకేష్ అంతిమయాత్రలో టీఆర్ఎస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. 

మరోవైపు రాకేష్ మృతికి నిరసనగా ఈ రోజు నర్సంపేట నియోజకవర్గ బంద్‌కు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక, రాకేశ్‌ మృతదేహానికి మంత్రి ఎర్రబెల్లి దయారకర్‌ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌ రెడ్డి, బస్వరాజ్‌ సారయ్య, ఎమ్మెల్యే నరేందర్‌ నివాళులు అర్పించారు. ఇక, రాకేష్ అంత్యక్రియలు నేడు అతని స్వగ్రామంలో నిర్వహించనున్నారు. 

ఇక, త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ స్కీమ్‌ను నిరసిస్తూ దేశవ్యాప్తంగా యువత ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ (secunderabad railway station) వద్ద జరిగిన నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన దామెర రాకేశ్‌గా గుర్తించారు. దీంతో అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది. 

ప్రస్తుతం రాకేష్ సోదరి సైన్యంలోనే పనిచేస్తున్నారు. రాకేశ్ ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని పరితపించాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనల్లో పాల్గొనడానికే హైదరాబాద్‌కు వచ్చాడని తెలిపారు.