హైదరాబాద్: ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన రెండు పిటిషన్లను సీబిఐ కోర్టు కొట్టేసింది. డిశ్చార్జీ పిటిషన్లను అన్నింటినాీ కలిపి విచారించాలని గతంలో వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. 

సిబిఐ కేసుల విచారణ ముగిసిన తర్వాతనే ఈడీ కేసుల విచారణ చేపట్టాలని కూడా ఆయన మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై జరిగిన సుదీర్ష వాదనలను విన్న తర్వాత డిశ్చార్జీ పిటిషన్లను అన్నింటినీ కలిపి వినేందుకు కోర్టు నిరాకరించింది. వాటిని వేర్వేరుగానే వినాలని కోర్టు నిర్ణయించింది. 

పెన్నా చార్జీషిట్ లోని అనుబంధ అబభియోగ పత్రంపై శుక్రవారం విచారణ ప్రక్రియను సిబీఐ కోర్టు ప్రారంభించింది. అయితే, తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరారు. ఈ రోజు విచారణకు మాత్రమే కోర్టు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. 

ఈ కేసులో మిగతా నిందితులు విజయసాయి రెడ్డి, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు, ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి, కొందరు పారిశ్రామికవేత్తలు కోర్టుకు హాజరయ్యారు. అన్ని కేసుల తదుపరి విచారణను కోర్టు ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.