సారాంశం

Energy Minister G Jagadish Reddy: కాంగ్రెస్ పార్టీని న‌మ్ముకుంటే తెలంగాణ నిండా మునుగుతుంద‌ని బీఆర్ఎస్ నాయ‌కుడు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ జ‌గ‌దీశ్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తే బీఆర్‌ఎస్‌ కోసం ప్రచారం చేస్తానని కాంగ్రెస్‌ నేత జానా రెడ్డి హామీ ఇచ్చారని చెప్పిన మంత్రి.. ఆ హామీని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని అన్నారు. విద్యుత్ సరఫరాపై జానా రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిప‌డ్డారు.
 

Telangana Assembly Elections 2023: కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే కర్ణాటక పరిస్థితి తెలంగాణలో పునరావృతమవుతుందనీ, కాంగ్రెస్ పార్టీని పొరపాటున నమ్మితే రాష్ట్రం నిండా మునిగిపోతుందని ఇంధన శాఖ మంత్రి జి జగదీశ్ రెడ్డి ప్రజలను హెచ్చరించారు. హైద‌రాబాద్ లో ప్రభుత్వ విప్ బీ సుమన్, పార్టీ నాయకుడు రాజారాం యాదవ్‌తో కలిసి విలేకరుల సమావేశంలో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఐదు గంటల కరెంటు కూడా ఇవ్వలేకపోయిందని విమ‌ర్శించారు.

"కాంగ్రెస్ మ్యానిఫెస్టోను నమ్మి కర్ణాటకలోని ప్రజలలా ఓటు వేస్తే, ఇక్కడి ప్రజలు కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటారు. బెంగళూరు సహా అన్ని ప్రధాన నగరాల్లో విద్యుత్ కోతలు ఉన్నాయి. కరెంటు కోతలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు" అని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. కర్నాటకలోని రైతులు పాములకు భయపడటమే కాకుండా మొసళ్లతో బాధపడుతున్నారని అందుకే సబ్ స్టేషన్ల వద్దకు మొసళ్లను తీసుకొచ్చి నిరసన తెలుపుతున్నట్లు తెలిపారు. కనీసం ఐదు గంటల కరెంటు ఇవ్వలేని కాంగ్రెస్ నేతలు ఇక్కడ నాటకాలు ఆడుతున్నారనీ, కర్ణాటకలో రైతుల పరిస్థితిని పోల్చి చూడాలని మంత్రి హితవు పలికారు.

ఒక్క కర్ణాటకలోనే కాదు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నింటిలో కరెంటు పరిస్థితి బాగాలేదనీ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా పరిస్థితిలో మార్పు రాలేదన్నారు. సెప్టెంబర్‌లో అంచనాలకు మించి కరెంటు డిమాండ్‌ వచ్చినా రైతులకు విద్యుత్‌ సమస్య రాకుండా సీఎం భరోసా ఇచ్చారని బీఆర్‌ఎస్‌ నేత తెలిపారు. ప్రభుత్వం 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తే బీఆర్‌ఎస్‌ కోసం ప్రచారం చేస్తానని కాంగ్రెస్‌ నేత జానా రెడ్డి హామీ ఇచ్చార‌నీ, అయితే, ఆ హామీని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని అన్నారు. విద్యుత్ సరఫరాపై జానా రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిప‌డ్డారు. "జానా రెడ్డి అబద్ధాలు వయసుతో పాటు పెరిగిపోతున్నాయి. ముందుగా కాంగ్రెస్ నేతలు కర్ణాటక రైతులకు సమాధానం చెప్పాలి.. ఆ త‌ర్వాత మేనిఫెస్టో గురించి ఇక్కడ మాట్లాడాలి" అని అన్నారు. ఇక బీజేపీని పై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. ఎన్నికల్లో పోటీ చేయ‌డానికి బీజేపీకి సరైన అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు.