హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరిన చాన్నాళ్లకు టీఎస్ ఆర్టీసీ జెఎసి నేత అశ్వత్థామ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. మహిళా కార్మికుల విషయంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశాలను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఆర్టీసీ మహిళా కార్మికులకు రాత్రి 8 గంటల వరకు డ్యూటీ వేయాలని కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే.

మహిళా కార్మికుల విషయంలో కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోవడం లేదని దాన్ని గుర్తు చేస్తూ అశ్వత్థామ రెడ్డి అన్నారు. ఆర్టీసీలో యూనియన్లు ఉండకూడదని అనడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న యూనియన్ ను ప్రభుత్వం గుర్తించాలని ఆయన కోరారు. 

యూనియన్లు వద్దంటూ కార్మికులతో సంతకాలు చేయించడం సరి కాదని ఆయన అన్నారు. యూనియన్లు వద్దంటూ కార్మికులతో బలవంతంగా సంతకాలు చేయిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తిరిగి విధుల్లో చేరిన తర్వాత ఓ కార్మికుడు కూడా సంతృప్తిగా లేడని అశ్వత్థామ రెడ్డి అన్నారు. 

కొన్ని రూట్లలో బస్సులను తగ్గించారని ఆయన అన్నారు. యూనియన్ నాయకులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.