హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకే ఓటు వేయండి.. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  స్థానిక అంశాల ఆధారంగా మాకు ఓటు వేయండని మార్వాడీలు, బెంగాలీలను ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కోరారు.

శనివారం నాడు రాత్రి పాతబస్తీలోని ఝాన్సీ బజార్ లో జరిగిన ఎన్నికల సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మార్వాడీలు, బెంగాలీలతో పాటు వ్యాపారులు ఎక్కువగా ఉండే ఈ డివిజన్ లో నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మీరు ఇంతకాలం మాకు దూరంగా ఉన్నారు. మా దగ్గరికి రండి... మనమంతా కలిసి ఈ డివిజన్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుదామని ఆయన చెప్పారు.

దేశంలోని పలు ప్రాంతాల నుండి బీజేపీ కీలక నేతలు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై ఆయన సెటైర్లు కురిపించారు. బీజేపీ తరపున ప్రచారానికి రావడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక్కరే మిగిలారని చెప్పారు. 

అంతకుముందు దత్తాత్రేయ నగర్ లో కూడా ఆయన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. హైద్రాబాద్ లో మత సామరస్యం దెబ్బతినకుండా పోరాటం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. 1980, 1990లలో నెలకొన్న పరిస్థితులు పునరావృతం కాకుండా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు.