కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ లేఖలు రాశారు. సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యత దినంగా నిర్వహించాలని కోరారు. 

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ లేఖలు రాశారు. సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యత దినంగా నిర్వహించాలని కోరారు. సెప్టెంబరు 17 అనేది పూర్వపు హైదరాబాద్ రాష్ట్రాన్ని యూనియన్ ఆఫ్ ఇండియాలో విలీనం చేసిన రోజుకు గుర్తు అని చెప్పారు. ఆ రోజును జాతీయ సమైక్యతా దినోత్సవంగా పాటించాలని సూచించారు. వలసవాద, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న పోరాటాలను జరుపుకోవడానికి ఇది ఒక సందర్భం అని పేర్కొన్నారు. 

‘‘సెప్టెంబరు 17న యూనియన్ ఆఫ్ ఇండియాలోకి పూర్వం హైదరాబాద్‌ రాష్ట్రాన్ని విలీనం చేసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత ప్రభుత్వం సంబరాలు జరుపుకోవాలని నిర్ణయించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. వివిధ రాచరిక రాష్ట్రాల ప్రవేశం, విలీనం అనేది నిరంకుశ పాలకుల నుంచి భూభాగాలను విముక్తి చేయడం మాత్రమే కాదని గమనించాలి. మరీ ముఖ్యంగా, జాతీయవాద ఉద్యమం ఈ భూభాగాల ప్రజలను స్వతంత్ర భారతదేశంలో అంతర్భాగంగా చూసింది. అందువల్ల.. విముక్తి కంటే ‘‘జాతీయ సమైక్యత దినోత్సవం’’ అనే పదం సముచితంగా ఉండవచ్చు’’ అని అసదుద్దీన్ లేఖలో పేర్కొన్నారు. పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం, అనేక ఇతర రాచరిక రాష్ట్రాల విలీనంతో... ఆ భూభాగాల ప్రజలు చివరకు భారతదేశ సమాన పౌరులుగా, రాష్ట్రాల యూనియన్‌గా గుర్తించబడ్డారని చెప్పారు. 

ఇక, తెలంగాణ విమోచనం కోసం ముస్లింలు, హిందువులు కలిసి పోరాడారని అసదుద్దీన్ చెప్పారు. సెప్టెంబర్ 17న పాతబస్తీలో తిరంగయాత్ర, బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. తమ ఎమ్మెల్యేలంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ఇందుకు సీఎం కేసీఆర్‌ను కూడా ఆహ్వానిస్తామని చెప్పారు.