ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి జెడ్ కేటగిరీ భద్రతను తిరస్కరించారు. యూపీలో ఆయన కాన్వాయ్‌పై కాల్పులు జరగ్గానే కేంద్ర ప్రభుత్వం ఆయనకు జెడ్ కేటగిరీ భద్రత ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. కానీ, అసదుద్దీన్ ఒవైసీ తిరస్కరించారు. తాజాగా పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ మరోసారి ఈ ప్రస్తావన తెచ్చారు. ఒవైసీ జెడ్ కేటగిరీ భద్రతను స్వీకరించాలని కోరారు. కాగా, ఒవైసీ మరోసారి ఈ భద్రతను తిరస్కరించారు. 

హైదరాబాద్: ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి జెడ్ కేటగిరీ భద్రతను తిరస్కరించారు. ఉత్తరప్రదేశ్‌లో ఆయన కాన్వాయ్‌పై కాల్పులు జరిగిన తర్వాత వెంటనే రాష్ట్రం నుంచి రిపోర్టులు తీసుకోగా.. ఆయనకు ముప్పు ఉండిందనే విషయం తెలిసిందని, ఆ విషయాల ఆధారంగానే ఒవైసీకి జెడ్ సెక్యూరిటీ భద్రత ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఆయన జెడ్ సెక్యూరిటీ భద్రతను స్వీకరించాలని ఆయన పార్లమెంటులో విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తి చేసిన గంటల వ్యవధిలోనే ఒవైసీ మరోసారి తనకు అందించాలనుకుంటున్న జెడ్ సెక్యూరిటీని వద్దని తిరస్కరించారు.

‘జెడ్ సెక్యూరిటీ తీసుకోవాలని అమిత్ షా ఈ రోజు నాకు అప్పీల్ చేశాడు. ఈ దేశంలోని దళితులు, మైనార్టీలు, అణగారినవర్గాలు భద్రంగా ఉన్నట్టయితే, నేనూ సురక్షితంగా ఉన్నట్టే’ అని అసదుద్దీన్ ఒవైసీ విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ రోజు సాయంత్రం అసదుద్దీన్ ఒవైసీకి అరుదైన విజ్ఞప్తి చేశారు. ఆయనకు అందించే జెడ్ కేటగిరీ సెక్యూరిటీ(Z Security)ని స్వీకరించాలని కోరారు. అసదుద్దీన్ ఒవైసీ హాపూర్ జిల్లాలకు వెళ్లడం ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమం కాదని ఆయన పార్లమెంటు(Parliament)లో మాట్లాడుతూ తెలిపారు. జిల్లా కంట్రోల్ రూమ్‌కు హాపూర్ వెళ్లడంపై సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇద్దరు దుండగులు ఆయన కార్ల కాన్వాయ్‌పై కాల్పులు జరిపారని వివరించారు. ఆ ఘటన నుంచి ఆయన సురక్షితంగా బయటపడగలిగారని తెలిపారు. అనంతరం ఆయన సురక్షితంగా ఆయన ఢిల్లీ చేరుకున్నారని చెప్పారు. కానీ, ఆయన వాహనానికి మూడు బుల్లెట్ల గాయాలు ఉన్నాయని అన్నారు. ఈ ఘటనను ముగ్గురు సాక్షులు ప్రత్యక్షంగా చూశారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్పారు. ఈ ఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాము రిపోర్ట్ తీసుకున్నామని అన్నారు. గతంలో కేంద్ర సెక్యూరిటీ ఏజెన్సీల సంకేతాలను చూస్తే.. ఒవైసీకి ఇంకా ముప్పు ఉన్నదని తెలిపారు. అందుకే ఆయనకు జెడ్ సెక్యూరిటీ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చామని వివరించారు. కానీ, ఆయన తిరస్కృత వైఖరి కారణంగానే ఆయనకు జెడ్ సెక్యూరిటీ ఇవ్వడంలో ఢిల్లీ, తెలంగాణ పోలీసుల ప్రయత్నం సఫలం కాలేదని చెప్పారు.

ఈ నెల 3వ తేదీ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన హాపూర్ వెళ్లారు. ప్రచార కార్యక్రమం అనంతరం ఆయన హాపూర్ నుంచి వెళ్లిపోతుండగా ఇద్దరు దుండగులు అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. 

ఈ నేపథ్యంలో.. ఆయనకు భద్రత పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అసదుద్దీన్ భద్రతపై సమీక్ష జరిపిన కేంద్ర హోంశాఖ.. సీఆర్పీఎఫ్‌తో జెడ్ కేటగిరి భద్రతా కల్పించాలని నిర్ణయం తీసుకుంది.

కానీ, అసదుద్దీన్ ఒవైసీ ఈ భద్రతను తిరస్కరించారు. ఆయన పార్లమెంటులో మాట్లాడుతూ.. బ్యాలెట్‌పై నమ్మకం లేకుండా .. బుల్లెట్‌పై నమ్మకం పెట్టుకుని తన కాన్వాయ్‌పై కాల్పులు జరిపిన వారు ఎవరంటూ లోక్‌సభలో ప్రశ్నించారు మజ్లీస్ పార్టీ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. తాను చావుకు భయపడటం లేదని.. తనకు ‘‘జడ్’’ కేటగిరీ సెక్యూరిటీ అవసరం లేదన్నారు. సామాన్య పౌరుడిలా ఏ కేటగిరీలో వుంటానని.. కాల్పులు జరిపిన వారిని శిక్షించాలని అసదుద్దీన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.