హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. మల్కాజిగిరి పోలీసు పరిధిలో అదృశ్యమైన ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. అతను కూడా వివాహితుడే. 

ప్రేయసీప్రియులిద్దరు మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద మంగళవారం రైలు కిందపడి ఆత్మహత్యే చేసుకున్నారు. మల్కాజిగిరి యాదవ్ నగర్ కు చెందిన డ్రైవర్ మొత్తులూరి శంకర్ (30), అతని భార్య సంతోషి (29) మంగళవారం గొడవపడ్డారు. 

ఆ తర్వాత ఆమె బయటకు వెళ్లిపోతూ తాను చచ్చిపోతున్నానని, తన చావుకు ఎవరూ బాధ్యులు కారని సూసైడ్ నోట్ రాసి పెట్టి వెళ్లింది. శంకర్ తన భార్య అదృశ్యంపై మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

సాయంత్రం మాసాయిపేట బంగారమ్మ దేవాలయం సమీపంలో ఓ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. విచారణలో వారిలో ఒకరిని సంతోషిగా గుర్తించారు. ఆమెతో పాటు ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని మల్కాజిగిరిలోని మిర్జాలగూడాకు చెందిన సాయినాథపురంలోని మెడ్ ప్లస్ ఉద్యోగి ఎస్. రవి కుమార్ (30) గా గుర్తించారు. వారి మధ్య పదేళ్లుగా పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది.