మునుగోడు ఉప ఎన్నిక సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో ఏర్పాట్లను ముమ్మరం చేసింది.
మునుగోడు ఉప ఎన్నిక సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు (ఈవీఎం), పోస్టల్ బ్యాలెట్ బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ పూర్తయిందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ తెలిపారు. అక్టోబర్ 18న ఈవీఎంల తొలి విడత ర్యాండమైజేషన్ పూర్తయిందని.. 35 శాతం అదనపు ఈవీఎంలు, వీవీప్యాట్‌లను రిజర్వ్‌గా రిటర్నింగ్ అధికారికి కేటాయించామని తెలిపారు.
మొత్తం 1,207 బ్యాలెట్ యూనిట్లు, 403 కంట్రోల్ యూనిట్లు, 403 వీవీపీఏటీలు అందుబాటులో ఉంచినట్టుగా తెలిపారు. ఈవీఎంల రెండో ర్యాండమైజేషన్ అక్టోబర్ 20న పూర్తయిందని.. పోలింగ్ స్టేషన్ల వారీగా ఈవీఎంల కేటాయింపు, వాటి విభజన కూడా పూర్తయిందని చెప్పారు. పోలింగ్ సిబ్బందికి అక్టోబరు 27, 28 తేదీల్లో రెండు రోజులపాటు రెండో శిక్షణను ఏర్పాటు చేసి.. మూడు బ్యాలెట్ యూనిట్లను ఎలా అనుసంధానం చేయాలనే దానిపై ప్రిసైడింగ్ అధికారి వారికి వివరిస్తారని తెలిపారు. 25శాతం రిజర్వ్‌తోపాటు అవసరమైన సంఖ్యలో పోలింగ్ సిబ్బందిని నియమించేందుకు ఎన్నికల అధికార యంత్రాంగం చర్యలు చేపట్టినట్టుగా వివరించారు.
నియోజకవర్గంలో 80 ఏళ్లు పైబడిన 345 మంది ఓటర్లు ఉండగా.. 394 మంది దివ్యాంగుల ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి నిర్ణీత సమయంలోగా ఫారం 12డిని సమర్పించారని చెప్పారు. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం జారీ చేసిన సూచనలకు అనుగుణంగా సీనియర్ సిటిజన్లు, వికలాంగులు పోస్టల్ బ్యాలెట్లను వేయడానికి షెడ్యూల్ తయారు చేయబడిందనితెలిపారు.
ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు 12 కేసులు పెట్టామని.. రూ. 2,49,65,960 నగదు స్వాధీనం చేసుకున్నామని సీఈవో తెలిపారు. పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది 1,483.67 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. 36 మందిని అరెస్టు చేయడంతో పాటు 77 కేసులు బుక్ చేశారని వెల్లడించారు.
ఐపీసీ సెక్షన్ 171 బీ ప్రకారం.. ఎన్నికల ప్రక్రియలో ఎవరైనా నగదు లేదా వస్తు రూపంలో ఏదైనా తాయిలాలు ఇవ్వడం లేదా స్వీకరించడం చేస్తే.. ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించబడుతుందని తెలిపారు. అలాగే ఐపీసీ సెక్షన్ 171 సీ ప్రకారం.. ఎవరైనా అభ్యర్థిని లేదా ఓటర్లను లేదా మరే ఇతర వ్యక్తిని బెదిరించినా, గాయపరిచినా ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించబడతాయని చెప్పారు.
మునుగోడు ఉప ఎన్నిక అదనపు పరిశీలకునిగా ఐఆర్‌ఎస్ అధికారి సుబోధ్ సింగ్‌ను, వ్యయ పరిశీలకులుగా సమత ముళ్లపూడి ఈసీ నియమించింది. అయితే నియోజకవర్గంలో అక్రమ నగదు ప్రవాహాన్ని నియంత్రించడానికి ఆదాయపు పన్ను శాఖ మరో ఏడుగురు సిబ్బందిని నామినేట్ చేసింది. ఇక, టోల్ ఫ్రీ నంబర్ (08682230198)తో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడిందని వికాస్ రాజ్ తెలిపారు. 14 మంది సభ్యుల బృందం ఫిర్యాదులను 24 గంటలపాటు పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఇక, అదనపు సీఈవో కె.మాణిక్క రాజ్ ఆదివారం మునుగోడు నియోజకవర్గంలో పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించడంతోపాటు జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు.
