రేపటి హుజురాబాద్ సభకు భారీ ఏర్పాట్లు.. దళిత బంధుపై స్వయంగా పాట రాసిన కేసీఆర్
దళితబంధు పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు హుజూరాబాద్ సిద్ధమవుతోంది. హుజూరాబాద్- జమ్మికుంట ప్రధాన రహదారి పక్కనే శాలపల్లి ఇందిరానగర్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధును ప్రారంభించనున్నారు. ముందుగా 15 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చెక్కులను సీఎం అందజేయనున్నారు.
రేపు కరీంనగర్ జిల్లా హుజూర్బాద్ మండలం శాలపల్లిలో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగసభకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దళిత బంధు పథకం ప్రారంభోత్సవం నేపథ్యంలో వేదిక ఏర్పాటు, సభాస్థలి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే నియోజకవర్గంలో దళితబంధు అనర్హులకి ఇస్తున్నారంటూ వివాదాలు తలెత్తగా.. సద్దుమణిగేలా యంత్రాంగం చొరవ తీసుకుంది.
మరోవైపు దళితబంధు పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు హుజూరాబాద్ సిద్ధమవుతోంది. 2018 మే 10న హుజూరాబాద్- జమ్మికుంట ప్రధాన రహదారి పక్కనే శాలపల్లి ఇందిరానగర్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రారంభించి ఇక్కడి రైతులకు పెట్టుబడి సాయాన్ని చెక్కుల రూపంలో అందించారు. ఈ నెల 16న అదే స్థలంలో సీఎం దళితబంధు లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున చెక్కులు ఇవ్వబోతున్నారు. నాడు మంత్రిగా, స్థానిక ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కనే ఉన్న ఈటల రాజేందర్ తర్వాతి పరిణామాలతో పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఇక్కడే ప్రారంభిస్తుండటంతో ఈ సభకు రాజకీయంగానూ ప్రాధాన్యం ఏర్పడింది.
సభకు లక్షమంది వచ్చినా ఇబ్బందులు లేకుండా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. నియోజకవర్గంలోని దళిత కుటుంబాలతోపాటు మహిళా సంఘాల వారిని, ప్రజలను ఇక్కడికి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 825 బస్సులు, మరో 600 వరకు ఇతర వాహనాల్ని ఉపయోగిస్తున్నారు. భద్రత కోసం 3500 మంది పోలీసులను వినియోగిస్తున్నారు. జర్మన్ హంగర్ విధానంతో సభాస్థలిలో రెండు వేదికలతోపాటు ప్రాంగణాన్ని పటిష్ఠంగా ఏర్పాటు చేస్తున్నారు. బలమైన గాలులు వీచినా.. పెద్ద వర్షం పడినా తట్టుకునేందుకు వీలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందు రెండు వేదికల్లో ఒకటి కళాకారుల ప్రదర్శనకు కాగా.. మరో దానిని ముఖ్యమంత్రి సహా ప్రజా ప్రతినిధులు వినియోగించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
నియోజకవర్గంలో ఇప్పటికే దళితబంధు విషయంలో తలెత్తిన వివాదాలను సద్దుమణిగించేలా మంత్రులతోపాటు అధికారులు చొరవ చూపించారు. పథకాన్ని అందరికీ వర్తింపజేయాలని వీణవంక మండలంతోపాటు పలుచోట్ల ఆందోళనలు జరగడంతో నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తామనే సంకేతాల్ని మంత్రులతోపాటు అధికారులు ఇస్తున్నారు. ప్రారంభ కార్యక్రమానికి మాత్రం 15 మందిని ఎంపిక చేసే పనిలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది.
మరోవైపు దళిత బంధు పథకం కోసం ఇప్పటికే పాటలు కూడా సిద్ధమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభిస్తున్న దళితబంధు పథకం ఉద్దేశం, లక్ష్యాలు, కార్యాచరణ వివరిస్తూ పాటలను రూపొందించారు. పథకాన్నిఅత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. స్వయంగా పాటలు రాశారు. కవులు, రచయితలతో కలిసి ఈ ప్రక్రియలో పాలుపంచుకున్నారు.