వనపర్తి: వనపర్తి జిల్లాలోని గోపాల్ పేట మండలం బుద్దారంలో భూ తగాదాల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఈ ఘటనలో ప్రత్యర్ధులు భార్యాభర్తలపై కత్తులో దాడికి దిగారు. మహిళపై ఓ వ్యక్తి కత్తితో విపరీతంగా దాడికి దిగాడు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో గాయపడిన దంపతులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించిన తర్వాత హైద్రాబాద్ కు తరలించారు. 

మహిళను ఓ వ్యక్తి కత్తితో దాడి చేస్తున్న సమయంలో స్థానికులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. కానీ, ఈ దారుణాన్ని ఆపేందుకు ఎవరూ కూడ ప్రయత్నించలేదు.   రెండు వర్గాలకు మధ్య భూ వివాదాలు ఉన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. భూ తగాదాల కారణంగానే ఈ దాడి చోటు చేసుకొందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

బుద్దారం గ్రామానికి చెందిన అర్జునయ్య, అనంతరాములు దాయాదులు. వీరిద్దరి మధ్య 22 గుంటల భూమి విషయంలో 10 ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరి పొలాలు కూడ పక్క పక్కనే ఉంటాయి. వారం రోజులుగా ఈ భూముల విషయంలో గొడవలు చోటు చేసుకొన్నాయి.

బుధవారం నాడు ఉదయం అర్జునయ్య వర్గీయులు అనంతరాములు కుటుంబంపై దాడికి దిగారు. అర్జునయ్య కొడుకు అనంతరాములుపై దాడి చేశాడు. అర్జునయ్య కత్తితో అనంతరాములు భార్య గొంతుపై నరికాడు.