ఖాజాగూడలో కొత్తరాతియుగపు ఆనవాళ్లు వెలుగు చూశాయి. హైదరాబాద్‌లోని లాంకోహిల్స్ సమీపంలో ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ టీమ్ లాంకోహిల్స్ పరిసరాల్లోని మెహర్ బాబా, అనంతపద్మనాభ స్వామి కొండపై పరిశోధనలు చేయగా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని లాంకోహిల్స్ సమీపంలో కొత్త రాతియుగపు ఆనవాళ్లు కనుగొన్నట్టు ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వెల్లడించారు. అపురూప శిలాకృతు వద్ద ఆదిమ మానవుని అడుగుజాడల అన్వేషణలో భాగంగా ఖాజాగూడ లాంకోహిల్స్ పరిసరాల్లోని మెహర్ బాబా, అనంతపద్మనాభ స్వామి కొండపై పరిశోధనలు చేశారు. ఇక్కడ కొత్తరాతియుగపు మానవులు తమ రాతి గొడ్డళ్లను పదునుపెట్టుకోగా ఏర్పడి రాతి గ్రూప్స్‌ను ప్లీచ్ ఇండియా బృందం గురువారం గుర్తించినట్టు శివనాగిరెడ్డి తెలిపారు.
పద్మనాభ స్వామి ఆలయ దారికి రెండు వైపుల సహజ సిద్ధంగా ఏర్పడ్డిన నాగపడిగె లాంటి రాతి బండల కింద ఆనాటి మానవులు తాత్కాలికంగా నివసించేవారని శివనాగిరెడ్డి చెప్పారు. అక్కడ నివసించేటప్పుడు వారు రాతి పనిముట్లకు పదును పెట్టుకునేవారని ఈ రాతి గాళ్లు తెలియజేస్తున్నట్టు వివరించారు.
నాలుగు చోట్ల 30 సెంటి మీటర్ల, 20 సెంటి మీటర్ల మధ్య పొడవు, 2 సెంటి మీటర్ల వెడల్పు, 2 సెంటి మీటర్ల నుంచి 5 సెంటి మీటర్ల లోతు గల రాతి గాళ్లున్నాయని వారు తెలిపారు. వాటి ఆకారం, అరగదీసిన తీరును పరిశీలిస్తే.. ఇవి కచ్చితంగా 6000 నుంచి 4000 ఏళ్ల క్రితం నాటివని పేర్కొన్నారు. గతంలోనూ నార్సింగి, కోకాపేట, జూబ్లిహిల్స్, బీఎన్ఆర్ హిల్స్‌లో కొత్తరాతి యుగపు ఆనవాళ్లు వెలుగు చూశాయని వివరించారు.
Also Read: పార్లమెంటు ప్రత్యేక సమావేశాల తేదీలపై విపక్షాల అభ్యంతరం.. గణేశ్ చతుర్ధినాడు సమావేశమని మండిపాటు
ఖాజాగూడ కొత్తరాతియుగపు ఆనవాళ్లు హైదరాబాదు నగర పురా చరిత్రకు ఆధారాలు అవుతాయని, కాబట్టి, వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్లీచ్ ఫౌండేషన్ టీమ్ ఆలయ సిబ్బందికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్లీచ్ ఇండియా ఆర్కియాలజిస్టులు మైత్రేయి, దుర్గ, నయన్, సాక్షి, కిరణ్, జితేంద్ర పాల్గొన్నారు.
